యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు శనివారం వావిలపల్లి గ్రామానికి చెందిన బంటు సైదులు అనే రైతు ఆందోళనకు దిగాడు.దీనితో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… వావిలపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెం.436/6 లో నెల్లికంటి బాబుకు చెందిన 520 చదరపు గజాల భూమి నుండి తాను డాక్యుమెంట్ ద్వారా 250 గజాలు కొనుగోలు చేశాను.తన పేరు మీద రిజిస్టర్ చేయమని రిజిస్టర్ ఆఫీస్ ని సంప్రదించగా నీ యొక్క పేరు మీద ఉన్న భూమి ఆన్లైన్లో సీలింగ్ పట్టా అని వస్తుందని, ఎమ్మార్వో ఆఫీస్ నుండి ఆ భూమి సీలింగ్ పట్టానా లేదా ఒరిజినల్ పట్టానా పూర్తి వివరాలను తీసుకొని రావాలని కోరగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లగా ఎమ్మార్వో రూ.30 వేలు ఇస్తే సర్టిఫికేట్ ఇస్తానని 15 రోజుల నుండి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని,పని మాత్రం చేయడం లేదని ఆరోపించారు.గట్టిగా మాట్లాడితే తనపై కేసు పెడతామని ఎమ్మార్వో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.మాలాంటి బాధితులు ఎంతోమంది ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని,ఏమీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.