హైదరాబాద్: గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి తెలంగాణకు ప్రత్యేక సబ్సిడి ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బేగంపేట లోని సివిల్ సప్లై కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చి దేశ జీడీపిని పెంచి, ప్రగతి సాధిస్తామని చెప్పారని… ఇప్పడు నిజంగానే గ్యాస్(జీ), డీజిల్(డీ), పెట్రోల్(పీ) ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.2014 లో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర, ప్రస్తుతం రూ.1000 కి చేరిందని… పెరిగిన రూ.600 సబ్సీడి ఇవ్వాలని, తెలంగాణకు ప్రత్యేక సబ్సీడి ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్డు మీద ఆందోళనలు చేసే పరిస్థితి వస్తుందనుకోలేదన్న ఎమ్మెల్సీ కవిత, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలందరూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
రైతులు, గిరిజనుల రిజర్వేషన్లు, గ్యాస్ ధరల పెంపు విషయంలో, మొత్తం తెలంగాణను రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని అన్ని వర్గాలు బాగుండాలని సీఎం కేసీఆర్ గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, రైతులకు రైతు బంధు ద్వారా ఇప్పటికే 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.
కానీ తెలంగాణ వ్యాప్తంగా అద్బుతంగా పంటలు పండినా, కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనడానికి ముందుకు రావడం లేదన్నారు.దీంతో ప్రతి గ్రామంలో రైతులు ఆందోళనలో ఉన్నారన్న ఎమ్మెల్సీ కవిత, పంజాబ్ మాదిరిగానే తెలంగాణలోనూ 100 శాతం వడ్లు కొని డబ్బులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గిరిజనులు రిజర్వేషన్లపై రాష్ట్రం నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంది అసత్యాలు చెబితే, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో నిరసన వ్యక్తం చేశారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించేందుకు తెలంగాణ ఆడబిడ్డల పక్షాన ఢిల్లీలో కొట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను ఎంపీ కవిత డిమాండ్ చేశారు.అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో యువత ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.2014 నుండి ఇప్పటి దాకా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల మీద ప్రజలకు సబ్సీడి ఇవ్వకుండా ప్రభుత్వం 23 లక్షల కోట్లు దోచుకుందన్నారు ఎమ్మెల్సీ కవిత.
పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులకు ఎగ్గొట్టిన రూ.11 లక్షల కోట్లను మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం, సామాన్యులకు మాత్రం ఏం ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన సబ్సీడి డబ్బును, పెద్ద పెద్ద కంపెనీలకు దోచి పెడ్తోందన్న ఎమ్మెల్సీ కవిత, పేదలకు రుణమాఫీ చెయ్యకుండా బడా పారిశ్రామికవేత్తల రుణమాఫీ చేస్తోందన్నారు.
ప్రజా ఉద్యమాల ద్వారానే బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేయగలమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
పేదలకు అందుతున్న సబ్సీడి పక్కదారి పడుతున్న విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా తెలంగాణ యువ మిత్రులు సోషల్ మీడియా ద్వారా ఇంటింటికీ తెలియజేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.







