తెలుగుదేశం పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు వార్తల్లో ఉంటోంది.ఆయన పార్టీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తుండడం , పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వ్యవహారాలు చేస్తుండడం వంటివి ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
అసలు టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలోనే గంటా శ్రీనివాస రావు వైసిపి , జనసేన వంటి పార్టీల వైపు చూశారు.ఎన్నికల సమయం నాటికి టిడిపిని వీడి వేరే పార్టీలో చేరాలని చూశారు.
అయితే వైసీపీ నుంచి ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు.తప్పనిసరి పరిస్థితుల్లో టిడిపి నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.
ఇక ఆ తరువాత వైసీపీలోకి వెళ్లేందుకు గంటా ప్రయత్నించారనే వార్తలు వచ్చాయి.
ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సైతం చేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే నేడు 12 నియోజకవర్గాల టిడిపి ఇన్చార్జిల తో సమావేశం నిర్వహించబోతున్నారు.
విశాఖ , విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కార్యాలయం లో సమావేశం కాబోతున్నారు.దీనికి మూడు జిల్లాలకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొనబోతున్నారు.
అయితే దీనికి గంటా శ్రీనివాసరావు హాజరు కావడం లేదని పార్టీ కి సమాచారం అందించారు .తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందునే తాను ఈ సమావేశానికి రాలేకపోతున్నానని , తరువాత చంద్రబాబును కలుస్తాను అంటూ సమాచారం పంపడం చర్చనీయాంశంగా మారింది.
అసలు గంటా శ్రీనివాసరావు టిడిపి లో ఉంటారా లేక వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారా ? అసలు ఆయన వైఖరి ఏమిటనేది టీడీపీ అధినేత కే అంతుపట్టడం లేదు.చాలా కాలంగా గంటా శ్రీనివాసరావును బాబు లెక్కలోకి తీసుకోనట్టు గానే వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు పార్టీ నిర్వహించబోయే కీలక సమావేశానికి ఆయన హాజరు కాకపోవడం వంటి వ్యవహారాలు మరిన్ని అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి.