తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ బిఆర్ఎస్( BRS ) దూకుడు పెంచింది.తరచుగా పర్యటనలు చేపడుతూ, పార్టీకి ఆదరణ పెంచేందుకు కింది స్థాయి నేతల్లో ఉత్చాహం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి వారు తరచుగా జిల్లాలు పర్యటనలు చేపడుతూ, కీలకమైన ఎన్నికల హామీలను ఇస్తూ , ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.దీనిలో భాగంగానే మంత్రి కేటీఆర్( Minister KTR ) జిల్లాల పర్యటనలో అనేక కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు.
కొన్ని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ వారిని గెలిపించాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు.బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందుగానే అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితులు అనుకూలంగా మార్చేందుకు కేటీఆర్ చొరవ తీసుకుంటున్నారు.
బిజెపి, కాంగ్రెస్ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చర్చకు పెడుతున్నారు .వివాదాలు లేని నియోజకవర్గాల్లో ని అభ్యర్థులను ఖరారు చేస్తూ, వారిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిస్తున్నారు.ఈ మధ్య కాలంలో కేటీఆర్ జిల్లా పర్యటనలు ఎక్కువగా చేపడుతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పర్యటనలో పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించుకోవాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ మాజీ ఎంపీ వినోద్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి అని , బండి సంజయ్ ను ఇంటికి పంపి వినోద్ ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.అలాగే ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.
వరంగల్ లో వినయ్ భాస్కర్, కామారెడ్డి జిల్లా జక్కల్ లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే విషయంలోనూ కేటీఆర్ ఇదే విధంగా ప్రకటనలు చేశారు.కేటీఆర్ జిల్లా పర్యటనల్లో ఈ విధంగా కొన్ని కొన్ని కీలకమైన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తుండడంపై పార్టీలో చర్చనీయాంశం గా మారింది.అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కేటీఆర్ మౌనంగా ఉండడంతో , అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్ దక్కడం లేదనే ప్రచారం జరుగుతుంది.ఆయా నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది.రామగుండం ఎమ్మెల్యే చందర్ గురించి మాట్లాడిన కేటీఆర్ చందర్ మంచి యువకుడు అని ,బాగా కష్టపడతాడని ,
ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్నాడని, ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన బిడ్డ అనుకుని కడుపులో పెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు .కానీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను మరోసారి గెలిపించుకోవాలని చెప్పకపోవడంతో, ఆయనకు టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతుంది.ఇక పెద్దపల్లి ఎంపీ బార్లకుంట వెంకటేష్ పేరును కూడా కేటీఆర్ ప్రస్తావించలేదు దీనిపైన చర్చ జరుగుతోంది.అవినీతి వ్యవహారాలు, గ్రూపు రాజకీయాలతో వివాదాల్లో ఉంటున్న వారి విషయంలో సైలెంట్ గా ఉండడంతో వారికి టిక్కెట్ దక్కదు అనే ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం కేటీఆర్ జిల్లా టూర్లపై ఆయా జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది.