గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో కీలక నేత గా, మంత్రిగా పనిచేసిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( MLA Mallareddy )కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.చాలా కాలంగా మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే గతం నుంచి రేవంత్ రెడ్డితో రాజకీయ వైరం ఉండడం, ఆయనను చేర్చుకునేందుకు మెజార్టీ కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోకపోవడం, తదితర కారణాలతో ఆయన చేరిక వాయిదా పడుతూ వస్తుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.
అనేకసార్లు రేవంత్ కు సవాళ్లు విసిరిన మల్లారెడ్డి ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తన విషయంలో యాక్షన్ ప్లాన్ కు దిగక ముందే ఆ పార్టీలో చేరితే, తన రాజకీయ భవిష్యత్తుకు, తన వ్యాపార వ్యవహారాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఆలోచనతో ఉన్నారు.
మల్లారెడ్డికి అనేక మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు , ఇతర వ్యాపారాలు , ఆస్తులు ఉన్నాయి.వీటికి సంబంధించి ఎన్నో ఆరోపణలు, వివాదాలు, కేసులు ఉన్నాయి.మూడు రోజుల కిందట తమ కాలేజీ కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన రోడ్డు ను సైతం అధికారులు తొలగించారు.
ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.అయితే ఆయనను కాంగ్రెస్ ( Congress ) లో చేర్చుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో, కర్ణాటక కాంగ్రెస్ కు చెందిన కీలక నేతతో మల్లారెడ్డి రాయబారం నడిపారని, దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు అడ్డంకులు తొలగిపోయాయని మల్లారెడ్డి అనుచరులు చెబుతున్నారు.
కాకపోతే మల్లారెడ్డి రాకను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.గత ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి( Former MLA Sudhir Reddy ) కాంగ్రెస్ లో చేరారు.అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ , సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ వంటి వారు మల్లారెడ్డి రాకుండా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.అయితే పై స్థాయి నుంచి ఒత్తిడి ఉండడంతో మల్లారెడ్డి చేరికకు రేవంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.