ఈ సృష్టి కేవలం మనుషులకు మాత్రమే కాకుండా కొన్ని వేల కోట్ల జీవరాసులకు నిలయం.రక రకాల జాతులకు చెందిన జీవులు ఈ భూమి పై నివసిస్తుంటాయి.
కొన్ని జీవులు చూడటానికి భయంకరంగా కనిపించినా వాటి నుంచి ఎటువంటి ప్రమాదం ఉండదు.మరి కొన్ని జీవులు చాలా చిన్నగా ఉన్నప్పటికీ వాటికి ఎంతో బలం కలిగి ఉంటుంది.
అలాంటి జాతికి చెందినదే ఈ ‘డయాబోలికల్ ఐరన్ క్లాడ్‌బీటిల్’.
ఈ జీవి చూడటానికి చిన్న పరిమాణంలో ఉండి, చూడగానే ఒళ్ళు జలదరించే అంత భయంకరంగా ఉన్న ఈ జీవి ఎంతో శక్తివంతమైనదని తాజా పరిశోధనలో వెల్లడైంది.
ఎంత శక్తివంతమైనది అంటే ఆ జీవి మీద కారు వెళ్ళినా కూడా చనిపొనంత బలం కలిగి ఉంది.అయితే ఈ జీవి అంత బలంగా ఉండటానికి గల కారణం ఏమిటి అని శాస్త్రవేత్తలు తీవ్రంగా ఈ జీవి పై పరిశోధనలు చేస్తున్నారు.
ఐరన్ క్లాడ్ బీటిల్ శరీరం బలంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకోవటానికి వివిధ రకాల పరిశోధనలు, సిటీ స్కాన్ , మైక్రోస్కోప్ లను ఉపయోగించి తీవ్రంగా శ్రమించిన తర్వాత ,ఈ జీవి శరీరంలో ఉండే ప్రత్యేక జిగ్‌షా ఆకారంలో ఉండే శరీర నిర్మాణాలే అందుకు కారణమని పర్డ్యు యూనివర్శిటీ’ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాలిఫోర్నియా అడవుల్లో నివసించే ఈ జీవి తన బరువు కన్నా 39 వేల రెట్లు అధికంగా ఉన్న బరువును మోయగలదని ఈ సందర్భంగా తెలియజేశారు.
దీనితో పాటు నివసించే ఇతర జాతికి చెందిన జీవులు తన శరీర బరువు కన్నా కేవలం మూడు రెట్లు మాత్రమే అధిక బరువును తట్టుకోగలవు.ఐరన్ క్లాడ్ బీటిల్ శరీరం పై అధిక ఒత్తిడిని కలుగ చేసినప్పుడు అది ఒక్కసారిగా చనిపోకుండా, దాని శరీరం చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.