నిన్న మొన్నటి వరకు తెలంగాణలో జనసేన అభ్యర్థుల గెలుపు పై ఏ విధమైన ఆశలు లేకపోయినా కూకట్పల్లి నియోజక వర్గం పై మాత్రం అంతో ఇంతో అంచనాలు ఉండేవి.ఇప్పుడు జనసేన పార్టీ క్రమంగా ఆ స్తానం కోసం పోరాడుతున్న విధానం చూస్తే ఆ సీటును జనసేన సవాల్ గా తీసుకున్న వాతావరణం కనిపిస్తుంది.
ముఖ్యంగా జనసేన కోసం వేరు వేరు ప్రాంతాల నుంచి పనిచేసే అనేక టీంలు కూకట్పల్లిలో ప్రత్యక్షమై ఆ పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్న విధానం చూస్తే జనసేన కచ్చితంగా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాలని పట్టదలతో ఉన్నట్లుగా అర్థమవుతుంది .ఎన్నికల ప్రచారం చివరి రోజున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా కూకట్పల్లిలోని తమ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తూ ఇక్కడ గెలుపు ఏపీ ఎన్నికలను ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించడం చూస్తుంటే, రెండు అసెంబ్లీలోనూ ఉనికి చాటుకున్న పార్టీగా రికార్డ్ సృష్టించాలని పవన్న పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది .

అయితే ఆంధ్ర ప్రాంతపు పార్టీగా గుర్తింపు పొందిన జనసేనకు తెలంగాణ ఓటరు ఏ మేరకు మద్దతు పలుకుతాడు అన్నది కూడా అనుమానమే అయినప్పటికీ ప్రత్యేకంగా కూకట్పల్లి వరకూ ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు ఎక్కువ స్థాయిలో ఉండటం , తెలుగుదేశానికి ఒకప్పుడు కంచుకోట గా ఉన్న నియోజకవర్గం అవడంతో టీడీపీ మిత్ర పక్షం గా ఉన్న తమకు తెలుగుదేశం అభిమానుల మద్దతు దొరుకుతుంది అన్న అంచనాలలో జనసేన ఉంది.

ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం జనసేన( Telugu Desam Janasena party ) సమన్వయం ఏ మేరకు కుదిరిందో అన్నదానికి ఒక టెస్టింగ్ శాంపిల్ గా కూకట్పల్లి నిలబడే అవకాశం కనిపిస్తుంది .మరి తెలుగుదేశం కేడర్ జనసేనకు ఏ మేరకు మద్దతు పలుకుతుందో చూడాలి.కనీసం ఓడిపోయినా కూడా గట్టి పోటీ ఇచ్చి ఓడిపోతే పర్వాలేదు కానీ భారీ స్థాయిలో ఓటమి ఉంటే మాత్రం అది జనసేనకు ఆత్మహత్య సదృశ్యంగా మారుతుంది అనటంలో మాత్రం ఏ మాత్రం సందేహం లేదు.
ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఎన్నికలకు మద్య ఎక్కువ సమయం లేదు కాబట్టి కచ్చితంగా ఆ మైండ్ సెట్ ఆంధ్ర ఓటర్ల పై పడే అవకాశం కూడా కనిపిస్తుంది.