తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరుగుతాయా లేక ముందస్తు ఎన్నికలు జరుగుతాయా అనే విషయంలో ఎవరికీ సరైన క్లారిటీ లేదు.కానీ ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చనే అభిప్రాయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉంది.
ప్రస్తుతం జాతీయ రాజకీయాలపైనే కేసీఆర్ దృష్టిపెట్టారు.కొత్త జాతీయ పార్టీ ని ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలో టిఆర్ఎస్ వ్యవహారాలు మొత్తం మంత్రి కేటీఆర్ చూసుకుంటున్నారు.2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలనే పట్టుదలతో కేటీఆర్ ఉన్నారు.ఈ మేరకు తెలంగాణలో టిఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది ? ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది ? సిట్టింగ్ ఎమ్మెల్యేల లో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎవరెవరు ఎదుర్కొంటున్నారు ? ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు ప్రశాంత్ కిషోర్ సర్వేలు చేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్ కేటాయించాలి అనే విషయంపై ప్రశాంత్ కిషోర్ టీం కసరత్తు చేస్తూ, ఎప్పటికప్పుడు నివేదికలు కేటీఆర్ కు అందిస్తోంది.
తాజాగా తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేపడుతున్నారు.ఈ సర్వేల ఆధారంగా టిఆర్ఎస్ కు టిక్కెట్లు కేటాయించే అవకాశం ఉండడంతో, ఇప్పుడు ప్రశాంత్ కిషోరే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను తీసుకున్నట్లు గా కనిపిస్తున్నారు.
ఖమ్మం జిల్లా కు చెందిన పార్టీ ప్రముఖులతో ఈ సందర్భంగా టికెట్ల కేటాయింపు అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.

” ప్రశాంత్ కిషోర్ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయిస్తున్నారు.ఆ నివేదిక ఆధారంగానే టికెట్లు దక్కుతాయి.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.అవసరమైన చోట కొన్ని మార్పులు ఉంటాయి.గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం.టికెట్లు రాని వారిని పార్టీ వదులుకోదు.విభేదాలను పక్కనపెట్టి సఖ్యతతో పనిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 10 కి 10 సీట్లు వచ్చేలా పనిచేయాలి ” అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.
టీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి అనే విషయంపైన అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది.