అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మాచవరం నుండి మండపేట వస్తుంటే మార్గం మధ్యలో బట్టీల వద్ద మెయిన్ రోడ్డులోని గుంతలు పూడుస్తూ కనిపించాడోయువకుడు.ఎందుకు ఏమిటి అని ఆరా తీస్తే రెండు రోజులు క్రితం రామచంద్రపురం నుండి భార్యా, కుమార్తె తో కలిసి మండపేట వస్తుంటే ఆకస్మికంగా ఎదురైన ఈ గోతులో పడి అందరూ గాయాల పాలైనట్లు తెలిపారు.
ఈ రోడ్డులో కొంత దూరం చదునుగా ఉండి ఆకస్మికంగా పెద్ద పెద్ద గోతులు ఎదురవ్వడంతో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు.ఆ క్షణంలో పాప అరిచిన కేకలు ఇంకా తన కళ్ళ ముందు కదాలాడుతూనే ఉన్నాయన్నారు.
తనలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి ఎదురు కాకూడదనే ఉద్దేశ్యంతో తనకు తోచినంతలో ఇటుకలు నల్లరాళ్లు సిమెంటు తీసుకువచ్చి గోతులు పూడ్చుతున్నట్లు తెలిపాడు.
మండపేట రామచంద్రపురం రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన గోతులు చాలానే ఉన్నాయి.
ఈ రోడ్డులో వెళ్లే ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది.సమస్యను ఆర్ అండ్ బీ డీఈ దృష్టికి తీసుకు వెళ్లగా ఎప్పటిలానే నాలుగు రోజుల్లో గుంతలు పూడుస్తామంటూ వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలో ఏ పక్కకు వెళ్లినా రహదారులన్నీ అధ్వానంగా వున్నాయని ఇటువంటి వంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని పలువురు వాహనదారులు వాపోయారు.ఇలాంటి ఘటనలు చూసైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.