యాదాద్రి జిల్లా:రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఫామ్ హౌస్ లో నిద్రలో ఉన్న కేసీఆర్ కి నిద్రమత్తు వదిలిందని హుజురాబాద్ ఎమ్మెల్యే,బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ అన్నారు.శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక, చిల్లాపురం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈటెల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీకి లేని నిధులు టిఆర్ఎస్ పార్టీకి ఎక్కడి నుంచి వచ్చాయని,మునుగోడు ఎన్నికల్లో ఆ నిధుల నుంచే టిఆర్ఎస్ పార్టీ భారీగా డబ్బులు ఖర్చు పెడుతుందని ఆరోపించారు.
ఇప్పటికే మునుగోడులో పలు రకాలుగా డబ్బులను పంపిణీ చేసేందుకు టిఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉంచుకున్నారని వాటిని బీజేపీ అడ్డుకోబోదని,అక్రమంగా సంపాదించిన డబ్బును పంచాలని కోరుకుంటున్నామని అన్నారు.వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్,40 ఏళ్ళ చరిత్ర కలిగిన బీజేపీ పార్టీలకు సొంత విమానం లేదని,కేసీఆర్ కు మాత్రం సొంత విమానం కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనల్లో ప్రతి గ్రామంలో 10 నుండి 15 బెల్టు షాపులను ఏర్పాటు చేసి తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దళిత బంధు,గిరిజనబంధు,చేనేతబంధు,గొల్ల కురుమలకు గోర్లను ప్రజలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మునుగోడుకు నిధులు కావాలని ఎన్నిసార్లు ముఖ్యమంత్రికి విన్నవించినా పట్టించుకోలేదని అందుకే చివరి అస్త్రంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు.మునుగోడులో ఓడిపోతామని భయంతోనే రాష్ట్రంలో ఉన్న 70 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడులో పాగా వేస్తున్నారని, ముఖ్యమంత్రి ఎన్ని కుయుక్తులు పన్నినా ధర్మం గెలుస్తుందని,బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు,రమేష్ రాథోడ్, దోనూరి వీరారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు జక్కల విక్రమ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.







