ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ తో టిఆర్ఎస్ ప్రభుత్వంకు మధ్య దూరం పెరిగిపోయింది.మొదట్లో సఖ్యతగా మెలిగినా ఇప్పుడు మెలగడం లేదు.
అధికారిక కార్యక్రమాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు , మంత్రులు చివరకు ముఖ్యమైన అధికారులు సైతం హాజరు కావడం లేదు. రాజ్ భవన్ లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపించినా, కెసిఆర్ హాజరు కాకపోవడం పై గత కొంత కాలంగా దుమారం రేపుతూనే ఉంది.
ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ గవర్నర్ ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును తప్పు పట్టారు.దీంతో గవర్నర్ కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందనే వ్యాఖ్యలకు మరింత బలం చేకూరింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పైన పడింది.ఎప్పటి నుంచో తన మంత్రివర్గాన్ని విస్తరించాలని కెసిఆర్ చూస్తున్నారు.కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ తో ఏర్పడిన విభేదాల కారణంగా మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు మంత్రివర్గాన్ని కెసిఆర్ విస్తరించాలంటే తప్పనిసరిగా గవర్నర్ కార్యాలయానికి వెళ్లాల్సిందే.కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందుకు కేసీఆర్ ఒప్పుకోరు.
అలాగే మంత్రివర్గ విస్తరణ చేపట్టినా, ప్రమాణస్వీకారం చేయించాల్సిన వ్యక్తి గవర్నర్ కావడంతో కెసిఆర్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారట.ప్రస్తుతం దేశ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారించారు.
కేంద్ర అధికార పార్టీ బిజెపిని ఇరుకున పెట్టే విధంగా కెసిఆర్ రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు.దీనికి తగ్గట్లుగానే బిజెపి సైతం గవర్నర్ ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం దూకుడుకు బ్రేకులు వేసే విధంగా వ్యవహరిస్తోంది.

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో గవర్నర్ భేటీ అయ్యారు.ఆ తర్వాత ఆమె మీడియా సమావేశం నిర్వహించి కెసిఆర్ పై విమర్శలు చేయడం, తన తల్లి మరణించినా కేసీఆర్ పలకరించలేదని వాపోవడం వంటివి ఎన్నో జరిగాయి.ఇలా ఎన్నో అంశాలు గవర్నర్ కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య మరింత దూరాన్ని పెంచాయి.అదే తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై ప్రభావాన్ని చూపిస్తోంది.