అయిపోయింది అనుకున్న కథ మళ్లీ మొదటికి వచ్చింది.ఏం కథ? చందమామ కథా? కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కథ.పంతొమ్మిదేళ్లు సుదీర్ఘంగా సాగిన అక్రమాస్తుల కేసులో బెంగళూరులో ఏర్పాటు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు జయమ్మను ‘దోషి’ గా తేల్చడం, ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన భక్తుడైన పన్నీరు శెల్వంను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించడం, ఆ తరువాత కర్నాటక హైకోర్టు ‘అమ్మ’ ఏ తప్పూ చేయలేదని నిర్దోషిగా విడుదల చేయడం, వెంటనే ఆమె ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చుని, ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకోవడం…ఇదీ ఇప్పటివరకు జరిగిన కథ.కర్నాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించడంతో దేశమే ఆశ్చర్యపోయింది.‘లెక్కల మాయాజాలం’ కారణంగా జయను నిర్దోషిగా ప్రకటించారని న్యానిపుణులు కొందరు విశ్లేషించారు.ఈ కేసుకు ఆద్యుడైన భాజపా నేత డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి, డిఎంకే అధినేత కరుణానిధి సుప్రీం కోర్టుకు పోతామని చెప్పారు.
సుప్రీంలో పిటిషన్ వేయాలని కర్నాటక సర్కారును కూడా డిమాండ్ చేశారు.అనేక తర్జనబర్జనల తరువాత ఈరోజు కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.మే ఇరవైమూడో తేదీన జయ నిర్దోషిగా విడుదల కాగా, సరిగ్గా నెల రోజుల తరువాత అంటే జూన్ ఇరవైమూడో తేదీన కర్నాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది.ఈ కథ ఎన్నాళ్లు సాగుతుందో మరి….!
.






