కొందరు గొప్పవాళ్లు ఉంటారు.వారికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తాయి.
ప్రపంచ దేశాలు ప్రశంసిస్తాయి.కాని వారెవరో సామాన్య జనానికి తెలియదు.
ప్రభుత్వాలు కూడా పట్టించుకోవు.రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా నటీ నటులు…వీరికి జనం నీరాజనాలు పడతారు.
అంటే కొందరు గొప్పోళ్లకు మాస్ ఇమేజ్ ఉండదు.నాయకులు, క్రీడాకారులు, సినిమావాళ్ల కంటే వీరు సమాజానికి ఎక్కువ సేవ చేసి ఉంటారు.
కాని జనం గుర్తించరు.అంతర్జాతీయ సంస్థలు గుర్తించి బహుమతులు, అవార్డులు అందచేస్తాయి.
సామాన్య జనానికి తెలియని గొపోళ్లలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి ఒకరు.బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కృషి చేస్తున్న ఈయనకు , బాలికా విద్య గురించి పోరాటం చేసిన పాకిస్తాన్‌కు చెందిన బాలిక మలాలాకు ఉమ్మడిగా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు.
సత్యార్థి హైదరాబాద్ వచ్చారు.కాని ఆయనకు ఘన స్వాగతమేమీ లభించలేదు.
ప్ర భుత్వమూ పట్టించుకోలేదు.తన కుమార్తె చదువుతున్న బిజినెస్ స్కూలు స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చారు సత్యార్థి.
ఆయనెవరో మీడియాకు తెలుసు కాబట్టి ప్రెస్‌క్లబ్‌కు ఆహ్వానిస్తే వచ్చి ప్రసంగించారు.బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి తెలియచేసి ఈ విషయంలో తాను తెలుగు రాష్ర్టాలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
తాను సేవలు అందిస్తానని చెప్పారు.మరి ప్రభుత్వాలు సత్యార్థిని ఉపయోగించుకుంటాయా?
.






