టీడీపీ సిట్టింగ్ ఎంపీ జేసీ దివాకరరెడ్డి వ్యవహారం పార్టీలో పెద్ద తలనొప్పిగా మారింది.తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టుగా ఆయన తాను చెప్పిందే జరగాలి… నేను ఇమ్మన్నవారికే టికెట్లు ఇవ్వాలంటూ మొండిపట్టు పడుతూ అధినేత చంద్రబాబు కి తలనొప్పిగా మారారు.
అనంతపురం జిల్లా రాజకీయాల్లో తలపండిన జేసీకి మొదటి నుంచి అక్కడ బలమైన క్యాడర్ ఉంది.ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుపు పక్కాగా ఆయన్నే వరిస్తూ వస్తోంది.
ఏ విషయాన్నైనా కుండబద్దలగొట్టినట్టు మాట్లాడే జేసీ ఇప్పుడు టికెట్ల కేటాయింపు విషయంలో తన మాటే నగ్గాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ని ఇబ్బందిపెట్టేస్తున్నాడు.సిట్టింగుల్లో చాలా మందిని మార్చకపోతే ఓటమి తప్పదని గతంలోనే చెప్పిన జేసీ ఇప్పుడు జిల్లాలో నలుగురు సిట్టింగులను మార్చాలని పట్టుబడుతున్నారు.
నేను చెప్పినట్టు కేటాయింపులు చేయకపోతే తమ కుటుంబం ఎంపీ సీటును వదులుకునేందుకు సిద్ధంగా ఉందంటూ ప్రకటించాడు.దీంతో సీట్ల కేటాయింపు దగ్గర పేచీ మొదలయ్యింది.
కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు అంగీకరించిన బాబు జేసీ చెప్పిన వారికి ఇచ్చేందుకు రెడీగా లేరని తెలుస్తోంది.జేసీకి వ్యతిరేకంగా జిల్లాలోని మిగిలిన నేతలంతా ఏకమయ్యారు.
అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో విభేదాలు ఉన్న కారణంగా ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ జేసీ చెప్పినట్లు తెలుస్తోంది.దీనికి తోడు జేసీ వర్గానికి చెందిన కార్పొరేటర్లు, ఇతర నాయకులు అనంతపురం నుంచి అమరావతి వరకు తమ నిరసన గళాన్ని వినిపించారు.

ముఖ్యంగా అనంతపురం, కదిరి, సింగనమల, కల్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల టికెట్లు దక్కించుకునేందుకు పెద్ద ఎద్దుట్టున నాయకులు పోటీపడుతున్నారు.దీంతో ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు.గతంలో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినా ఈ సారి ఆ పరిస్థితి కనిపించడంలేదు.అనంతపురం నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న మైనార్టీలు, బలిజలు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని మరీ చౌదరికి టికెట్ కేటాయించవద్దని ఒక వేళ అలా చేస్తే తాము రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
కొందరు చౌదరికి వ్యతిరేకంగా కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకునేందుకు ప్రయత్నించారు.బలిజ సామాజికవర్గానికి చెందిన మునిరత్నం అనంతపురం టికెట్ కోసం అమరావతిలో ఆందోళన చేశారు.అసలు అనంతపురం జిల్లా లో ఈ రేంజ్ లో ఫైటింగ్ నడవడానికి జేసీనే కారణం అనేది స్పష్టం అవుతోంది
.