జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆయనకు ఉన్న అభిమానులు , సామాజికవర్గం అండదండలు ఇవన్నీ చూసుకుంటే బలమైన నాయకుడిగానే ఆయనను చూడవచ్చు.అయితే ఎప్పుడో జనసేన పార్టీని స్థాపించినా, పూర్తిగా జనాలో బలం పెంచుకోవడం లేకపోవడం, తనకు ఉన్న లక్షలాది మంది అభిమానులను, కాపు సామాజిక వర్గాన్ని పూర్తిస్థాయిలో తనకు అనుకూలంగా మార్చుకోవడం లో పవన్ విఫలం అవ్వడమే ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందులు తీసుకొస్తున్నాయి.2019 ఎన్నికల్లో కనీసం పదుల సంఖ్యలో అయినా జనసేనకు సీట్లు వస్తాయని భావించినా, కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.స్వయంగా పార్టీ అధినేతగా ఉన్న పవన్ ఓటమి చెందడం ఆ పార్టీని మరింత కుంగదీసింది.
ఇక 2019 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ పై పూర్తిస్థాయిలో పవన్ దృష్టి పెట్టి జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించారు.
అమరావతి వ్యవహారం , ఇసుక కొరత తదితర అంశాలపై పెద్ద పోరాటం నడిపించారు.అదే స్పీడ్ అయిదేళ్ల పాటు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.దీంతో జనసేన ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో ఉంటుందని, టీడీపీ బలహీనం కావడంతో జనసేన ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది అని అభిప్రాయపడినా, పవన్ మాత్రం కొద్దిరోజులకే సైలెంట్ అయిపోయారు.సినిమాల వైపు మొగ్గు చూపడంతో రాజకీయాలపై ఫోకస్ తగ్గించారు.
అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, జనసేన బిజెపి రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా చేసిన పోరాటాలు అరుదుగానే ఉన్నాయి.ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఈ రెండు పార్టీలు వ్యవహారశైలి కనిపిస్తోంది.

ఇక పవన్ చేపట్టిన అనేక ఉద్యమాలు ఆయన గ్రాఫ్ తగ్గించాయి.ఏ ఉద్యమం అయినా పవన్ మధ్యలోనే వదిలేస్తారని, ఆరంభం లో హడావుడి చేసి తర్వాత సైలెంట్ అయిపోతారు అనే విమర్శలు ఆయనపై ఉన్నాయి.ఈ తరహా వ్యవహార శైలి కారణంగా నే పవన్ పై పార్టీ నాయకులలోనూ, జనల్లోనూ నమ్మకం సన్న గిల్లడానికి కారణం అయ్యింది.ఏ సమస్య పైన అయినా తాను మొదటి నుంచి చివరి వరకు పోరాడగలను అనే నమ్మకాన్ని పవన్ పెంచుకోగలిగితే జనసేన కు తిరుగుండదు అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.
మరి ఆదశగా ఇప్పటికైనా పవన్ అడుగులు వేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.పవన్ వైఖరిలో స్పష్టమైన మార్పు వస్తేనే జనసేన కు రాజకీయ మైలేజ్ వచ్చేది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.