జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం బాగా వంట పట్టించుకున్నట్టుగా కనిపిస్తున్నారు.రాజకీయాలలో మొహమాటాలకు, త్యాగాలకు తావులేదని, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి అనే విషయాన్ని పవన్ గ్రహించినట్టుగా కనిపిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పవన్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు బిజెపి కాస్త కంగారు పడి ఎట్టకేలకు అక్కడ పోటీలో లేకుండా బీజేపీకి మద్దతు ఇచ్చేలా ఒప్పించింది.అయితే ఈ వ్యవహారం పై పవన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇదిలా ఉంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో, ఇప్పటికే టిడిపి వై సీ పీ లు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి.టిడిపి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తుండగా, వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి టిక్కెట్ ఖరారు చేశారు.
అయితే ఇక్కడి నుంచి పోటీ చేయాలని బిజెపి తహతహలాడుతోంది.కానీ ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిని రంగంలోకి దించాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఈ మేరకు గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ చేసిన త్యాగానికి ప్రతిఫలంగా తిరుపతి లో పోటీ చేసే అవకాశం తమ పార్టీకి ఇవ్వాల్సిందిగా పవన్ బిజెపి పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డిమాండ్ పై వెనక్కి తగ్గకూడదని, జనసేనకు ఇక్కడ అ బలం ఎక్కువగా ఉందని, దానికితోడు బీజేపీ బలం కూడా తోడైతే, తిరుగులేని విజయం జనసేన ఖాతాలో పడుతుంది అనే అభిప్రాయంలో పవన్ ఉన్నట్లు సమాచారం.

ఈ వ్యవహారం తేల్చుకునేందుకు పవన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఢిల్లీకి వెళ్ళినట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.పవన్ ఢిల్లీ టూర్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తో పాటు, కొంతమంది సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నట్లు సమాచారం.ఎట్టిపరిస్థితుల్లోను తిరుపతి టికెట్ పై వెనక్కి తగ్గకూడదని అని, ఇప్పుడు మొహమాటపడి ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేస్తే, రాజకీయంగా జనసేన పరిస్థితి మెరుగ్గా ఉండదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు ఆయన ఢిల్లీ బాట పట్టినట్టు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ఈ విషయంలో బిజెపి పవన్ కు ఎటువంటి హామీ ఇస్తుందో ? అసలు ఈ వ్యవహారం పై బిజెపి మనసులో ఏముందో చూడాలి.