ప్రభుత్వాన్ని ఎలా ముందు నడిపించాలి అనే విషయం పై కంటే, రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఏ విధంగా అధికారంలోకి రావాలనే విషయంపైనే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ దృష్టి సారించారు. దానికి అనుగుణంగానే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలోను, ప్రభుత్వంలోనూ సంచలనం సృష్టిస్తున్నారు.
భారీ ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు జగన్ గత కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయి ? ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి ? ఇంకా తమ ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ? ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ దానికి అనుగుణంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.
ముఖ్యంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వేలు ఇప్పటికే పూర్తి చేసింది.దానికి సంబంధించిన రిపోర్టులు జగన్ కు అందాయి.
చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని, కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తే మళ్లీ వైసిపి ప్రభుత్వం ఏర్పడేందుకు ఎటువంటి డోఖా ఉండదు అనే విషయాన్ని జగన్ నివేదికల రూపంలో అందించడంతో, దానిపై సీరియస్ గానే కొద్ది రోజులుగా కసరత్తు చేశారు.ముఖ్యంగా రిజర్వడ్ నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చితే ఫలితం ఉంటుందనే అభిప్రాయానికి జగన్ వచ్చారట.
కొవ్వూరు నియోజక వర్గం విషయానికి వస్తే హోం మంత్రిగా ఉన్న తానేటి వనిత అక్కడ వైసిపి క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
దీంతో ఆమెను వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు నుంచి కాకుండా, గోపాలపురం నియోజకవర్గం పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట.అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావు ను మరో నియోజకవర్గానికి పంపాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇక గుంటూరు జిల్లాలో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఇదే స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సుచరిత కుటుంబానికి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట.అలాగే బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ ను తాడికొండ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట.
ఇక వేమూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మేరుగు నాగార్జునను వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి తప్పించి ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు పంపించాలని ప్రతిపాదనలో ఉన్నారట .రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ అయితే పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారో అక్కడ వేరొకరిని అభ్యర్థులుగా నియమించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారట.ఈ విధంగా రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలు మారిపోనున్నాయట.