దూకుడు నిర్ణయాలతో ఏపీ అధికార పార్టీ వైసిపి ఇప్పటి వరకు తమ హావ చూపించింది.ఏపీ సీఎం జగన్ తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానిని ఎటువంటి ఒడిదుడుకులు, అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
అదే సమయంలో దేశవ్యాప్తంగా జగన్ పాలన పై చర్చ కూడా జరుగుతోంది.ఇక ప్రజల్లోనూ వైసిపి పరిపాలనపై పూర్తిస్థాయిలో సంతృప్తి ఉందనే అభిప్రాయంతో జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు తెర తీశారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం నల్లేరు మీద నడకే అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఎన్నికలు వాయిదా పడడం ఆ పార్టీలో తీవ్ర నిరాశ కలిగించింది.అంతేకాకుండా వైసీపీ అధికారంలోకి వచ్చినా, తర్వాత చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు చాలామంది పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసినా జగన్ పెద్దగా చేరికలపై దృష్టి పెట్టలేదు.

తమ రాజకీయ ప్రత్యర్ధులను వైసీపీ లోకి తీసుకు వస్తే పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగడంతో పాటు, గ్రూపు తగాదాలు ఏర్పడి అనవసర తల నొప్పులు వస్తాయనే ఆలోచనతో చేరికల విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు.అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలంటే తప్పనిసరిగా తమ రాజకీయ ప్రత్యర్ధులను బలహీనం చేయాలని జగన్ భావించి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దీంతో పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైసీపీ కండువా కప్పుకున్నారు.ప్రతి జిల్లా నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీలోకి క్యూ కట్టారు.
ఇంకా అనేకమంది చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వాయిదా పడడంతో వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి.

వైసీపీలో చేరాలని ప్రయత్నాలు చేసిన నాయకులంతా ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు.మరి కొంతకాలం ఏపీలో రాజకీయ పరిస్థితులను పూర్తిస్థాయిలో పరిశీలించి అప్పుడు చేరాలా వద్దా అనే విషయంపై క్లారిటీ కి వస్తే బాగుంటుందనే ఆలోచనలో వీరంతా ఉన్నారు.మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కూడా వైసీపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, చివరి నిమిషంలో ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.
అంతే కాకుండా అనేక మంది నాయకులు తాత్కాలికంగా వైసీపీలో చేరే విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలన్నీ వైసీపీ లో కలవరం పుట్టిస్తున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల లో వైసీపీకి వచ్చే ఫలితాలను బట్టి ఆ పార్టీలో చేరే విషయంలో ఒక నిర్ణయానికి రావాలని పార్టీ మారాలనుకుంటున్నాడు తెలుగుదేశం నాయకులు అంతా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.విశాఖ జిల్లాకు చెందిన కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కి అనుబంధంగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి వారు కూడా కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.ఇలా ఎక్కడికక్కడ వైసీపీలోకి వలసలు బ్రేక్ పడటంతో ఇప్పుడు ఆ పార్టీలో సందడి కనిపించడం లేదు.