వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే యాభై రోజులు దాటింది.ఈ సమయంలోనే జగన్ ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.
క్షణం తీరికలేదు అన్నట్టుగా జగన్ పరిపాలన సాగుతోంది.మ్యానిఫెస్టోలో హామీల అమలు చేయడంతో పాటు జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి.
అందుకే వీలైనంత తొందరగా జగన్ పరిపాలనపై పూర్తి స్థాయి దృష్టిపెట్టాల్సి ఉంది.అయితే ఆ వెసులుబాటు ఈ యాభై రోజుల్లో పెద్దగా చిక్కలేదనే చెప్పాలి.
సీఎం ప్రమాణ స్వీకారం, అనంతరం మంత్రివర్గ విస్తరణ, తర్వాత అసెంబ్లీ తొలి సమావేశాలు, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు ఇలా ఒకదాని తరువాత ఒకటి వచ్చెయ్యడం కొంచెం ఇబ్బందికర పరిణామమే అని చెప్పాలి.

ఇక జగన్ యాభై రోజుల పరిపాలనపై అప్పుడే పెదవి విరుపులు కూడా మొదలయ్యాయి.జగన్ మంత్రివర్గంలో చాలా వరకు కొత్తవారు కావడం, జగన్ కు పరిపాలనపై పెద్దగా అనుభవం లేకపోవడం ఇవ్వన్నీ మైనస్ గా మారాయి.అలాగే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తీసుకున్న కీలక నిర్ణయాలు, హామీల అమల్లో అమ్మ ఒడి పథకం అమలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష, రాజధాని వ్యవహారాలు కీలకమైనవిగా కనిపిస్తున్నాయి.
దీనిలో అమ్మ ఒడి పథకాన్ని ఎవరికి వర్తింప చేయాలనే విషయంలో ప్రభుత్వంలో గందరగోళం తలెత్తింది.గతంలో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు దీన్ని వర్తింపజేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
కానీ అధికారంలోకి వచ్చాక ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపచేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు.విపక్షంతో పాటు ప్రజల్లోనూ వ్యతిరేకత రావడంతో చివరికి అన్ని స్కూళ్లకూ అమ్మఒడి వర్తింపచేస్తామని ప్రకటన చేయాల్సి వచ్చింది.

ఇక విద్యుత్ ఒప్పందాల విషయానికి వస్తే ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని కేంద్రం పదే పదే హెచ్చరికలు చేసినా జగన్ ముందుకు వెళ్లడం జగన్ కు చిక్కులు పెట్టిందనే చెప్పాలి.దేశవ్యాప్తంగా పీపీఏల విషయంలో ఓ పాలసీ అమలు చేస్తుంటే ఏపీలో మాత్రం తక్కువ ధరలకు కరెంటు ఇవ్వాల్సిందే అంటూ సీఎం జగన్ పట్టుబడుతున్నారు.ఇక కర్ణాటకలో జగన్ కు ఉన్న సండూర్ పవర్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తయ్యే కరెంటును ఎక్కువ రేటుకు విక్రయిస్తూ ఏపీలో మాత్రం తక్కువ రేటుకు కరెంటు కావాలంటూ జగన్ చేస్తున్న పోరాటంపై విమర్శలు వచ్చాయి.అమరావతి విషయంలో ప్రపంచబ్యాంకు, ఆసియా మౌలిక సౌకర్యాల పెట్టుబడుల బ్యాంకు తమ సాయాలు వెనక్కి తీసుకోవడంపైనా జగన్ సర్కార్ విమర్శలపాలయ్యింది.
ఇలా చెప్పుకుంటూ పోతే విపక్షాలకు కావాల్సిన అన్ని అస్త్రాలను జగన్ సర్కారే అందిస్తున్నట్టు కనిపిస్తోంది.