తెలంగాణలో ఉద్యోగాల జాతర కు సీఎం కేసీఆర్ తెరతీశారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి చాలా కాలంగా అవుతున్నా , ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేయకుండా కేసీఆర్ విమర్శలు ఎదుర్కొన్నారు.
బీజేపీ కాంగ్రెస్ వంటి పార్టీలతో పాటు , తెలంగాణలో కొత్త గా పార్టీ స్థాపించిన షర్మిల సైతం.నిరుద్యోగుల అంశంపై టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు.
అలాగే పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉద్యోగాలు రావడం లేదన్న ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు .అయినా, కేసీఆర్ మాత్రం ఉద్యోగాలు నోటిఫికేషన్ విషయంలో అంత ఆసక్తి చూపించలేదు.అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉండడం, నిరుద్యోగులు అంశంపైన టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ విమర్శలను ఎదుర్కోవడం వంటి కారణాలతో ఈరోజు ఉద్యోగాలు నోటిఫికేషన్ లు భారీ ఎత్తున విడుదల కాబోతున్న ట్లు ప్రకటించారు.

దాదాపు 91,147 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవుతోంది.ఎనిమిదేళ్లుగా ఏదో ఒక పథకాన్ని ప్రవేశ పెడుతూ ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నిస్తూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు భారీ స్థాయిలో నోటిఫికేషన్ లు జారీ చేయబోతున్నట్లు ప్రకటించారు.దీంతో ఇప్పటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం పై నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత ఒక్కసారిగా మాయమైనట్టు కనిపిస్తోంది.
ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయడం పై నిరుద్యోగులతో పాటు, విపక్షాలు సైతం హర్షం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది .అయితే తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులు ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కు ఇబ్బందికరంగా మారాయి.ఎందుకంటే తెలంగాణలో అమలు చేసిన పథకాలు , ప్రకటనల ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది.
అలాగే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది.
ఏపీ లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగాలు భారీ ఎత్తున భర్తీ చేశారు.వాలంటీర్లు, గ్రామ , వార్డు సచివాలయ పోస్టుల ను భారీగా భర్తీ చేయడంతోపాటు , ప్రతి యేటా నిరుద్యోగ క్యాలెండర్ ను ప్రకటిస్తామని జగన్ ప్రకటించారు.
కానీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో పెద్దగా ఉద్యోగాలు నోటిఫికేషన్ లు జారీ కాలేదు.ఇప్పుడు తెలంగాణలో ఈ స్థాయిలో భారీ నోటిఫికేషన్ వెలువడడంతో, జగన్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఖాయం గా కనిపిస్తోంది.
కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన ఇప్పుడు జగన్ కు ఇబ్బందికరంగా మారింది.