2024 ఎన్నికల్లో వైసీపీ ని మరోసారి అధికారంలోకి తీసుకురావాలనే బలమైన లక్ష్యంతో ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ ఉన్నారు.ప్రస్తుతం రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా, ఎన్నికల సమయం నాటికి తమ రాజకీయ ప్రత్యర్ధుల అంతా ఏకమై తమకు వ్యతిరేకంగా కూటమి కడతారనే విషయాన్ని జగన్ సీరియస్ గానే తీసుకున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నా, ప్రజలలో ఏదో ఒక అంశంపై అసంతృప్తి పెరిగిపోతోంది అనే విషయాన్ని జగన్ గుర్తించారు.
అందుకే పార్టీ నాయకులకు గట్టిగానే హితబోధ చేశారు.
వై ఎస్ ఆర్ సి పి శాసనసభ పక్ష సమావేశంలో జగన్ గట్టిగానే మాట్లాడారు.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అంతా పని చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు.
సర్వే ప్రకారం టిక్కెట్లు కేటాయింపు జరుగుతుందని , ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదని తేలితే వారిని పక్కన పెట్టి వారి స్థానం వేరొకరికి ఆ టికెట్ కేటాయిస్తాము అనే విషయాన్ని జగన్ స్పష్టం చేశారు.తనకు గెలుపే లక్ష్యం అని, గెలిచే వారికి టికెట్లు ఇస్తానని జగన్ ప్రకటించారు.
నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనేది సర్వే ద్వారా తెలుసుకుంటాను అని, సర్వేల్లో గెలుస్తారు అనుకున్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తానని క్లారిటీ ఇచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, మరో రెండు నెలల్లో మూడేళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్నామని, పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు.
రాబోయే రెండేళ్లు ఎంతో కీలకమని, ఒంటరిగా పోటీ చేసి మన సత్తా చాటాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. మళ్లీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు మరింతగా మెరుగుపడాలని , ఇక నిరంతరం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తూ, వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని , కనీసం ప్రతి ఇంటికి మూడుసార్లు తిరగాలని, ప్రతి గడపకు వెళ్లి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని జగన్ సూచించారు.
మే నెలలో పది గ్రామ సచివాలయ లను సందర్శించాలని ఎమ్మెల్యే లకు టార్గెట్లు విధించారు .మొత్తంగా సర్వే నివేదిక ఆధారంగా, గెలుపు గుర్రాలకు మాత్రమే జగన్ టిక్కెట్ ఇవ్వనున్నారు అనే విషయం అర్థం అయిపోయింది.