2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా, అప్పుడే ఎన్నికల హడావుడి లో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి.రాబోయే ఎన్నికల్లో గెలుపు ఏ విధంగా తమ ఖాతాలో వేసుకోవాలనే విషయంపై అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి.
ఏ నియోజకవర్గం పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలకు బలమైన కంచుకోటగా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి.ఆ నియోజకవర్గాల్లో ఎప్పుడు విజయం వారినే వరిస్తూ వస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు కు కుప్పం నియోజకవర్గం కంచుకోట గా ఉంది. అక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనకు ఉంది.
ఈ నియోజకవర్గంలో చంద్రబాబు సరిగా ఎన్నికల ప్రచారం నిర్వహించక పోయినా, ఆ నియోజకవర్గ ప్రజలు బాబుకు బ్రహ్మరథం పడుతోనే వస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ విషయానికొస్తే కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం ఆయనకు కంచుకోట అనే చెప్పాలి.
ఈ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి చెందిన వారు ఎవరు పోటీ చేసినా విజయం వారినే వరిస్తూ రావడం ఆనవాయితీగా మారింది.ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాత్రం సొంత నియోజకవర్గం అంటూ ఇప్పటివరకు ఏది లేదు.
మొన్నటి ఎన్నికల్లో మొదటి సారిగా పవన్ భీమవరం గాజువాక నియోజకవర్గంలో పోటీ చేశారు అయితే రెండు చోట్లా ఆయనకు పరాభవమే ఎదురైంది.దీంతో 2024 ఎన్నికల్లో పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది .2 నియోజకవర్గాలలోను కాపు సామాజిక వర్గం బలంగా ఉంది.అయినా పవన్ కు ఓటమి ఎదురవడంతో ఇప్పుడు ఏ నియోజకవర్గాన్ని పవన్ ఎంపిక చేసుకుంటారనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నా, కాపు సామాజికవర్గం మెజారిటీ సంఖ్యలో ఉన్నా, పవన్ ఓటమి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి.2019 ఎన్నికలకు ముందు నుంచే జగన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.అదే పవన్ కు రెండు చోట్లా ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.అయితే ఏదో ఒక నియోజకవర్గంలో బలంగా మారాలని చూస్తున్న పవన్ భీమవరం పై ఎక్కువ దృష్టి పెట్టారనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఈ నియోజకవర్గం పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు దూకుడుగా ఉన్నారు .స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ప్రతి విషయం లో ఇరుకున పెట్టేలా జనసేన వ్యవహరిస్తోంది.దీంతో ఈ నియోజకవర్గాన్ని పవన్ కంచు కోటగా మార్చుకుంటారు అనే ప్రచారం జరుగుతోంది.అదీ కాకుండా పశ్చిమగోదావరి పవన్ సొంత జిల్లా కావడం, కాపు సామాజిక వర్గం ప్రభావం ఈ జిల్లాలో ఎక్కువగా ఉండడం ఇలా ఎన్నో అంశాలు తనకి కలిసి వస్తాయి అనే లెక్కల్లో పవన్ ఉన్నారట.