ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు, ఆ పార్టీలోని కీలక నేతలు, సామాజిక వర్గాల లెక్కలను బయటకు తీస్తున్నారు కులాలవారీగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయంగా తమ కులానికి ప్రాధాన్యం ఎక్కువ దక్కేలా చేసుకునేందుకు అన్ని పార్టీలలోని నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు స్పష్టంగా ఆ కాంక్ష కనిపిస్తోంది ఏపీలో మెజార్టీ స్థాయిలో కాపు సోమాజిక వర్గం ఉన్నా, సీఎం కుర్చీలో తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న సామాజిక వర్గాలు దక్కించుకోవడంతో ఎన్నికల్లో ఏదో రకంగా కాపు సామాజిక వర్గానికి కీలకం చేయాలనే పట్టుదల ఆ సామాజిక వర్గంలో కనిపిస్తుంది.ఇప్పుడు కాపునాడు సమావేశాన్ని విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మాజీమంత్రి , టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాపునాడు నిర్వహించబోతున్నారు.
ఈ సందర్భంగా వంగవీటి రంగా వ్యవహారం తెరపైకి వచ్చింది.
ఆయన కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దైవంగా ఉన్నారు.ఆయన హత్యకు గురైన డిసెంబర్ 26ని విశాఖలో కాపునాడు ను నిర్వహిస్తున్నారు.1988 డిసెంబర్ 26న వంగవీటి రంగా హత్యకు గురయ్యారు.ఇప్పటికీ రంగ పేరు మారుమోగుతూ ఉండడానికి కారణం ఆయన ఆ సామాజిక వర్గంలో చెరగని ముద్ర వేయడమే కారణం.
అన్ని రాజకీయ పార్టీలు వంగవీటి రంగ పేరును ఉపయోగించుకుని, ఆ సామాజిక వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే వివిధ పార్టీల్లో ఉన్న కాపు సామాజిక వర్గం నేతలంతా ఏకతాటిపైకి వచ్చే విధంగా ఈ కాపునాడు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
టిడిపి, జనసేన లో కీలకంగా ఉన్న వారంతా ఈ కాపునాడు సమావేశంలో యాక్టివ్ రోల్ పోషిస్తుండడంతో, రాబోయే ఎన్నికల్లో పవన్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ తెరపైకి తెచ్చేందుకు, కాపు వ్యక్తికి సీఎం పీఠం దక్కాలనే విషయాన్ని ఈ సభ ద్వారా హైలెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

అన్ని రాజకీయ పార్టీలు కాపులను ఎన్నికల సమయంలో ఉపయోగించుకుని ఆ తర్వాత పట్టించుకోవడంలేదనే విషయాన్ని ఈ సభలో హైలెట్ చేసి కాపులకు ముఖ్యమంత్రి పదవి అనే అంశాన్ని మరింత హైలెట్ చేయాలనే పట్టుదల ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో కనిపిస్తుంది.దీనిలో భాగంగానే ఇప్పుడు గంటా ఆధ్వర్యంలో ఆ సభ జరగబోతుంది .ఈ కాపునాడు బహిరంగ సభ చర్చనీయాంశం గా మారింది.ఇప్పటికే గంటా టిడిపిని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని, అందుకే కాపునాడు సభకు సంబంధించిన ఫ్లెక్సీలోనూ ఒకవైపు గంటా ఫోటోతో పాటు, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు ముద్రించడం వెనక కారణం ఇదేనట.ఈ సభకు మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఏది ఏమైనా ఈ కాపునాడు బహిరంగ సభ ద్వారా మరో రాజకీయ కలకలం ఏపీలో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.







