తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అరెస్టుల హవా నడుస్తోంది.ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 317కు వ్యతిరేఖంగా దీక్ష చేపట్టిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఆయన అరెస్టును వ్యతిరేఖిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని భావించిన బీజేపీ నాయకులను కూడా పోలీసులు ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు.ఇలా చేయడంతో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బండి సంజయ్ పేరు మార్మోగిపోతుంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బండి సంజయ్ ని పరామర్శించేందుకు వచ్చారు.అంటే బండి సంజయ్ హవా ప్రస్తుతం జాతీయ స్థాయికి కూడా చేరింది.
బండి సంజయ్ ని ఇలా చేసేందుకు కారణం కూడా లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు నచ్చని వారిని, తనతో విభేదాలు పెట్టుకున్న వారిని మామూలుగా విడిచి పెట్టరని చాలా మంది చెబుతుంటారు.
ఇప్పుడు బండి సంజయ్ ని హైలెట్ చేసేందుకు కూడా అదే కారణమని చెబుతున్నారు.టీఆర్ఎస్ తో విభేదించి బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్ మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను రాజకీయంగా ఎదగకుండా చేసేందుకే కేసీఆర్ సంజయ్ ని ఇలా చేస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు.

తమతో విభేదించి బీజేపీలో చేరిన రాజేందర్ కు రాజకీయంగా ప్రధాన్యం లేకుండా చేసేందుకు కేసీఆర్ సంజయ్ ని హైలెట్ చేస్తున్నాడని అనేక మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈటల రాజేందర్ సరసన ఎవరూ చేరకూడదనే టీఆర్ఎస్ తో విభేదించి రెబల్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన రవీందర్ సింగ్ ను కూడా కేసీఆర్ ఇటీవల పార్టీలో చేర్చుకున్నాడని వారు చెబుతున్నారు.కేసీఆర్ ఇలా చేసేందుకు కారణం అదే అయి ఉంటుందని అంటున్నారు.