తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఘోర ఓటమి ఎదురైనా, ఆ ఓటమి నుంచి బీజేపీ ఇంకా తేరుకోలేదు.మరోవైపు చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది .
ఈ సమయంలో పార్టీ నాయకులు మధ్య ఆధిపత్య పోరు , గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండడం బిజెపి అగ్రనేతలకు కలవరం పుట్టిస్తుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రూపు రాజకీయాలే బిజెపికి పరాజయాన్ని తీసుకువచ్చింది.
అయినా ఆ పార్టీ నేతల్లో మాత్రం ఎక్కడా మార్పు వచ్చినట్లుగా కనిపించడం లేదు.ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో బిజెపి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి నాయకులను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా నాయకులు మధ్య సమన్వయ లోపం, గ్రూపు రాజకీయాలు ఇవన్నీ బిజెపికి ఇబ్బందికరంగా మారాయని సమావేశంలోనే సీరియస్ అయ్యారు.

ముఖ్యంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ , మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Bandi Sanjay, Etela Rajender ) ఇలా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడం వంటి వాటిపై సీరియస్ అయ్యి , ప్రత్యేకంగా వీరిద్దరికీ క్లాస్ పీకారు.అయినా వాళ్ళుల్లో ఏ మార్పు కనిపించడం లేదు . సోషల్ మీడియాలో ఈ ఇద్దరు నేతల మధ్య వార్ మరింతగా ముదిరింది .ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది.ఇక పార్టీ జాతి ఉపాధ్యక్షురాలు గా ఉన్న డీకే అరుణ, మరో జాతీయ నేత మురళీధర్ రావు పార్టీ కార్యక్రమాలకు తూతూ మంత్రంగా హాజరై వెళ్ళిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా, రాష్ట్ర నేతల మధ్య ఐక్యత లేకపోవడం, వీలైనంత ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదల లోపించడం వంటివి బిజెపి పెద్దలకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
ఇక కేంద్రమంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి దాటి బయటకు వెళ్లడం లేదనే ఫిర్యాదులు ఆయన పైన ఉన్నాయి .

ఇదేవిధంగా తెలంగాణ బీజేపీలోని కీలక నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం వంటివి తమ రాజకీయ ప్రత్యర్థులకు వరంగా మారుతాయనే భయమూ బిజెపి అగ్ర నేతల్లో కనిపిస్తోంది .అందుకే మరోసారి తెలంగాణ బిజెపి కీలక నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి, మేకల మధ్య సయోధ్య కుడుర్చి పార్లమెంట్ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే విధంగా కేంద్ర బిజెపి పెద్దలు రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం.