తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు ఎప్పుడూ సానుకూలంగా ఉండవు.కీలకమైన సమయంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి రేగడం ఆ పార్టీలో పరిపాటిగా మారింది.
ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంపైనే తమ దృష్టిని పెట్టాయి.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ లో మాత్రం ఎప్పటి మాదిరిగానే గ్రూపు రాజకీయాలు, అసంతృప్తులు బయటపడుతున్నాయి.ముఖ్యంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ గెలవదని, తాను తిరిగినా పదివేల ఓట్లు మాత్రమే వస్తాయని , తన తమ్ముడే గెలుస్తాడంటూ ఆయన విదేశీ పర్యటనలో కొంతమంది వద్ద వ్యాఖ్యానించారు.దానికి సంబంధించిన ఆడియో లీక్ కావడం తెలంగాణలో కలకాలం రేపింది.
వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉండడంతో , ఆయనకు పార్టీ నోటీసులు ఇచ్చింది.దీనికి వివరణ ఇవ్వాలంటూ కోరింది. అయితే వెంకటరెడ్డి మాత్రం ఆ నోటీసులకు స్పందించ లేదు.తాను పార్టీ నుంచి వెళ్లే కన్నా పార్టీ తనను బహిష్కరిస్తే ఆ సెంటిమెంట్ తో వేరే పార్టీలో చేరాలని చూస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుమానిస్తున్నారు.

అయితే ఇప్పటికిప్పుడు ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.ప్రస్తుతం కాంగ్రెస్ కు ఎంపీ స్థానాలు తక్కువగా ఉన్నాయి.వెంకటరెడ్డి పార్టీ నుంచి బహిష్కరిస్తే ఒక ఎంపీ స్థానం కోల్పోయినట్లు అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో దానిని కోల్పోయేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు.మరోవైపు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ పర్యటన మొదలైంది.
ఈ సమయంలో వెంకట్ రెడ్డిని కనుక పార్టీ నుంచి బహిష్కరిస్తే ఫోకస్ మొత్తం ఆయన వైపే ఉంటుంది.రాహుల్ పాదయాత్ర పై ఆ ప్రభావం స్పష్టంగా ఉంటుంది.
అది గ్రహించే వెంకటరెడ్డి కీలకమైన సమయంలో పార్టీపై విమర్శలు చేస్తూ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు.