తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్న కేంద్ర బిజెపి పెద్దలు ఈ మేరకు రాష్ట్ర నాయకులకు టార్గెట్లు విధిస్తూ.తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో, ఈసారి తమకు ప్రజలు తప్పకుండా అవకాశం కల్పిస్తారనే ధీమా తో బీజేపీ అగ్ర నేతలు ఉన్నారు.దీనిలో భాగంగానే తెలంగాణలో బిజెపిని మరింత బలోపేతం చేసే విధంగా రాష్ట్ర నాయకులకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత దిశ నిర్దేశం చేశారు.
రెండు రోజుల క్రితమే ఢిల్లీకి తెలంగాణ బిజెపి కీలక నాయకులను పిలిపించుకున్న అమిత్ షా, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు.రాబోయే ఎన్నికల్లో బిజెపికి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ? క్షేత్రస్థాయిలో పార్టీపై ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉంది ?.ప్రజల్లోకి పార్టీని మరింతగా తీసుకు వెళ్ళేందుకు ఏం చేయాలని విషయంపై ఆరా తీసారట.
దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలని విషయం పైన ప్రధానంగా చర్చించారట.బీఆర్ఎస్ ను ప్రజల్లో మరింత చులకన చేసేందుకు, ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు ఏం చేయాలనే విషయం పైన తెలంగాణ బీజేపీ నాయకులను ఆరా తీశారట. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కేసీఆర్ కుమార్తె కవిత పేరు ఉండడంతో, కెసిఆర్ కుటుంబం అవినీతికి, అక్రమాలకు పాల్పడుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు .అలాగే తెలంగాణ వ్యాప్తంగా బిజెపి తరఫున విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారట.ఈ సందర్భంగా టార్గెట్ కెసిఆర్ నినాదంతో తెలంగాణ బిజెపి నాయకులంతా పనిచేయాలని అమిత్ షా దిశా నిర్దేశం చేసారట.
ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై, ప్రధానంగా దృష్టి సారించాలని, ఇతర అంశాల జోలికి వెళ్ళవద్దని సూచించారట.