తెలంగాణలో మరో ఆరు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి ఎన్నికల బరిలో అధికారం కోసం ప్రధాన పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.
అధికార బిఆర్‌ఎస్( Brs ) ముచ్చటగా మూడోసారి అధికారం కోసం ట్రై చేస్తుంటే.కాంగ్రెస్, బీజేపీ ( Congress , BJP )పార్టీలు తొలిసారి అధికారం కోసం ఆరాటపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల మద్య పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది.అయితే పోటీ ప్రధాన పార్టీల మద్యనే అయినప్పటికి స్వతంత్ర అభ్యర్థుల నుంచి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల వేళఏ పార్టీ తో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలవడం సహజం.

అయితే కొందరు ఎన్నికల ముందు ఏదో ఒక పార్టీతో జట్టు కట్టడం లేదా ఎన్నికల తరువాత గెలిచిన వారు అధికార పక్షాన చేరడం వంటివి చూస్తూ ఉంటాము.అయితే స్వతంత్ర అభ్యర్థుల కారణంగా ప్రధాన పార్టీల నేతల ఓటు బ్యాంకుకు భారీగా గండి పడుతుంది.ఓట్ల చీలిక కారణంగా గెలుపు అంచున నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల నుంచి ముప్పు గట్టిగానే పొంచి ఉందని చెప్పక తప్పదు.2014 ఎన్నికల్లో 668 మంది, 2018 ఎన్నికల్లో 675 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.ఈ రెండు ఎన్నికల్లో కలిపి స్వతంత్రులు సుమారు 16.4 లక్షల ఓట్ల ను సాధించారు.

కాగా ఈసారి అంతకు మించి అనేలా ఏకంగా 991 మంది స్వతంత్రులు ఎన్నికల బరిలో నిలిచారు.ప్రతి వర్గానికి సగటున 9 నందు చొప్పున ఎన్నికల బరిలో ఉండడంతో వీరి ప్రభావం గట్టిగానే ఉండే అవకాశం ఉంది.ప్రస్తుతం కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అభ్యర్థుల మద్య గట్టి పోటీ ఉండడంతో స్వతంత్రులు చాప కింద నీరుల ఓటు శాతంలో చీలిక తెచ్చే అవకాశం ఉంది.
దీంతో బరిలో ఉన్న పార్టీలకు స్వతంత్రులే అసలు ప్రత్యర్థులని తెలుస్తోంది.మరి వీరి ప్రభావం ఎంతమేర ఉంటుంది ? వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎలాంటి ఫలితాలు సాధిస్తారు అనేది చూడాలి.