ఆముదం పంటకు చీడపీడల బెడద చాలా ఎక్కువ.సరైన సస్యరక్షణ పద్ధతులు పాటించకపోతే ఆముదం(Castor) చెట్టు ఆకులను పురుగులు పూర్తిగా తినేసి తీవ్ర నష్టం కలిగిస్తాయి.
ఆముదం పంటను ఆశించే పురుగులు ఏవో.వాటి నివారణకు తగిన చర్యలు ఏమిటో చూద్దాం.
ఉష్ణోగ్రతలు(Temperatures) అధికంగా ఉన్న సందర్భంలో తెల్ల దోమలు పంటను ఆశించి, ఆకు అడుగుభాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకు ముడతలుగా ఏర్పడి ఎండిపోతుంది.దీనిని సకాలంలో గుర్తించి ఒక లీటరు నీటిలో ఐదు మిల్లీలీటర్ల వేప నూనె(Neem oil) లేదా ఎసిఫేట్ 1.5 గ్రా.కలిపి మొక్కలు పూర్తిగా తడిసేలా పిచికారి చేయాలి.
ఒకవేళ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటిగ్రేట్ ఉన్నప్పుడు పచ్చ దోమ పంటను ఆశించే అవకాశం ఉంది.ఇది కూడా ఆకు అడుగుభాగం చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ఎండి చెట్లు ఎండిపోతాయి.
దీని నివారణకు ఒక లీటరు నీటిలో రెండు మిల్లీ లీ.ప్రోఫెనోపాస్ కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగులు గుంపులు గుంపులుగా మొక్కలపై దాడి చేసి ఆకులను అమాంతం తినేస్తాయి.లింగాకర్షణ బుట్టలను ఉంచి వీటి ఉనికిని గమనించాలి.మొదట లీటర్ నీటిలో రెండు మిల్లీలీటర్ల మోనోక్రోటోపస్ కలిపి పిచికారి చేయాలి.తరువాత దశలో ఐదు కిలోల తవుడు *అర కిలో బెల్లం * 0.5 లీటర్లు మోనోక్రోటోపస్ కలిపి పొలంలో చల్లాలి.అక్టోబర్ మాసంలో ఎక్కువగా దాసరి పురుగులు పంటను ఆశిస్తాయి.
పురుగుల ఉధృతి సాధారణంగా ఉంటే లీటర్ నీటిలో ఐదు మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారి చేయాలి.ఒకవేళ పురుగుల ఉధృతి విపరీతంగా ఉంటే లీటరు నీటిలో థయోడికార్బ్ 1.5గ్రా.పిచికారి చేయాలి.
మొక్క పుష్పించే దశలో ఉన్నప్పుడు కాయ తొలిచే పురుగులు, కొమ్మ పురుగులు పంటను ఆశించకుండా లీటరు నీటిలో రెండు మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ కలిపి పిచికారి చేసుకోవాలి.ఇలా పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సరియైన అవగాహన కల్పించుకుని పంటను సంరక్షించుకోవాలి.







