ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఏకంగా వాటిని ‘‘కిల్లర్స్ ’’ అని అన్యాయంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయని బైడెన్ గద్దించారు.
వ్యాక్సిన్లపై దుష్ప్రచారం వల్ల మహమ్మారిపై పోరాడటం, ప్రాణాలను కాపాడటం క్లిష్టంగా మారుతోందని బైడెన్, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ, అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఆరోపించిన సంగతి తెలిసిందే.దేశాన్ని కరోనా ఫ్రీ చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలకు సామాజిక మాధ్యమాలు తీవ్ర అవరోధాలుగా మారాయి.
ప్రస్తుత పరిస్ధితుల్లో వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రజలను వైరస్ బారి నుంచి రక్షించగలదని భావించారు బైడెన్.
కానీ సోషల్ మీడియాలో టీకాలపై రకరకాల పుకార్లు వ్యాపిస్తుండటంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు వారు భయపడుతున్నారు.
దీంతో ప్రభుత్వ ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతోంది.ఇది ఒక్క అమెరికాకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు.
దాదాపు అన్ని దేశాలు సోషల్ మీడియా వల్ల ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి.కొందరి తప్పుడు రాతల వల్ల ప్రభుత్వాలు వైరస్ కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది.
ఈ నేపథ్యంలో తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టే విధానాన్ని అభివృద్ధి చేశారు భారత సంతతి పరిశోధకుడి ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం.ఇది ఆన్‌లైన్‌లో ఆరోగ్య సంబంధిత శోధనల యొక్క ఖచ్చితత్వం, విశ్వసనీయతను 80 శాతం పెంచింది.
దీని వల్ల ప్రజలు కోవిడ్ 19 వంటి అంశాలపై మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సాయపడుతుంది.
కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూకు చెందిన ఈ బృందం.
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్‌లను కోవిడ్ 19కు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రజలు ఉపయోగించే అత్యంత సాధారణ సాధనాలుగా గుర్తించారు.ఈ క్రమంలో తప్పుడు సమాచారం వల్ల వాస్తవాలు మరుగునపడటంతో పాటు ప్రజల్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తుందని తేల్చింది.
అందుకే శోధనలలో విశ్వసనీయతను పెంచడానికి పరిశోధకుల బృందం కొత్త మార్గాన్ని సృష్టించింది.
వాటర్లూలోని చెరిటాన్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ విద్యార్ధిగా వున్న భారత సంతతికి చెందిన రోనక్ ప్రదీప్ ఈ పరిశోధనకు సారథ్యం వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కొత్త సమాచారం వెలువడుతుండటంంతో ఏది నిజమో, ఏది కాదో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు.వినియోగదారులకు ఉత్తమ ఆరోగ్య సమాచారాన్ని ఇచ్చేలా ప్రోత్సహించడం, ఇంటర్నెట్ సెర్చ్ ప్రోగ్రామ్‌లను మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని ప్రదీప్ చెప్పారు.
పరిశోధనలో భాగంగా ఈ బృందం రెండు దశల న్యూరాల్ రీరాంకింగ్ ఆర్కిటెక్చర్‌ని ఉపయోగించింది.ఇది డేటాలోని సరైనదానిని, సందేహాస్పదమైన సమాచారాన్ని విభజిస్తుంది.ఇందుకోసం లేబుల్ ప్రిడక్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు.ప్రధానంగా ఈ వ్యవస్థ.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డేటాపై ఆధారపడే సెర్చ్ ప్రోటోకాల్‌తో లింక్ చేస్తుంది.వాటర్లూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రదీప్, జుయివాంగ్ మా, రోడ్రిగో నోగ్యురా, జిమ్మీ లిన్ SIGIR “21, అనే ఈ పరిశోధనకు సంబంధించిన పత్రాన్ని సమర్పించారు.