భారత సంతతికి చెందిన ప్రముఖ విద్యావేత్త నీలి బెండపూడికి( Neeli Bendapudi ) ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.అమెరికాలో ( America ) ఉన్నత విద్యకు చేసిన కృషికి గాను ఈ ఏడాది ‘‘ఇమ్మిగ్రెంట్ అచీవ్‌మెంట్ అవార్డ్’’కు ( Immigrant Achievement Award ) ఆమె ఎంపికయ్యారు.
ప్రతి ఏడాది అమెరికా వారసత్వం పట్ల నిబద్ధత, అంకితభావాన్ని ప్రదర్శించే వ్యక్తి లేదా సంస్థకు ఈ అవార్డును అందజేస్తారు.ఏప్రిల్ 28న జరిగే డీసీ ఇమ్మిగ్రెంట్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ రిసెప్షన్‌లో 59 ఏళ్ల నీలి బెండపూడికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
గడిచిన 30 ఏళ్లుగా ఉన్నత విద్యలో విద్యార్ధుల విజయానికి నీలి బెండపూడి కృషి చేస్తున్నారని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెరెమీ రాబిన్స్ ప్రశంసించారు.సమగ్ర నైపుణ్యాన్ని పెంపొందించడం, విద్యార్ధులు, అధ్యాపకులు , సిబ్బంది అభివృద్ధి చెందడానికి అవకాశాలను సృష్టించేందుకు ఆమె శ్రమించారని ఆయన కొనియాడారు.

కాగా.నీలి బెండపూడి ఆంధ్రప్రదేశ్‌కు ( Andhra Pradesh ) చెందిన వారు.విశాఖపట్నంలో జన్మించిన ఆమె ఉన్నత చదువుల కోసం 1986లో అమెరికాకు వెళ్లారు.ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఎంబీఏని పూర్తి చేశారు.అనంతరం కాన్సాస్ యూనివర్సీటి నుంచి మార్కెటింగ్‌లో డాక్టరేట్‌ను పొందారు.డాక్టర్ వెంకట్ బెండపూడిని నీలి పెళ్లాడారు.
ఆయన ఒహియో స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్, యూనివర్సిటీ ఆఫ్ లూయిస్‌విల్లేలో అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు.

నీలి బెండపూడి. కెంటుకీలోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గానూ, ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వర్తించారు.కాన్సాస్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత అధికారిగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్‌గా, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా, ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ ఫౌండింగ్ డైరెక్టర్‌గానూ ఆమె సేవలందించారు.
గతేడాది ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా నీలి బెండపూడి ఎన్నికైన సంగతి తెలిసిందే.అంతేకాదు ఈ వర్సిటీకి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.







