అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో భారత సంతతి ఎక్స్‌పర్ట్‌కు కీలక పదవి దక్కింది.నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌కు ప్రధాన సలహాదారుగా ఏరోస్పెస్ ఇండస్ట్రీ నిపుణుడు ఏసీ చరణీయా నియమితులయ్యారు.
ఈయన ఈ హోదాలో నాసా చీఫ్ టెక్నాలజిస్ట్‌గానూ విధులు నిర్వర్తిస్తారు.చరణీయా జనవరి 3న నాసా ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకు ఈ పదవిలో భారత సంతతికే చెందిన భవ్య లాల్ విధులు నిర్వర్తించారు.నాసా చీఫ్ టెక్నాలజిస్ట్ హోదాలో ఏజెన్సీలో సాంకేతిక పెట్టుబడులు, ఆరు మిషన్ డైరెక్టరేట్‌లలో అవసరాలను ఆయన సమన్వయం చేస్తారు.
అలాగే ఇతర ఫెడరల్ ఏజెన్సీలు, ప్రైవేట్ రంగం, బయటి వ్యక్తుల నుంచి అందే టెక్నికల్ సపోర్ట్‌ను పర్యవేక్షిస్తారని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.నాసా ఆఫీస్ ఫర్ టెక్నాలజీ, పాలసీ అండ్ స్ట్రాటజీ కింద చరణీయా పనిచేస్తారు.
నాసాలో చేరడానికి ముందు చరణీయా రిలయబుల్ రోబోటిక్స్‌లో ప్రొడక్ట్ స్ట్రాటజీకి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.అంతకుముందు బ్లూ ఆరిజిన్‌లో లూనార్ పర్మానెన్స్ స్ట్రాటజీలో కీలకపాత్ర పోషించారు.అలాగే వర్జిన్ గెలాక్టిక్ (ప్రస్తుతం వర్జిన్ ఆర్బిట్) లాంచర్‌వన్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రోగ్రాం కోసం స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్‌మెంట్‌లోనూ చరణీయా పనిచేశారు.

అంతకుముందు స్పేస్ వర్క్స్ ఎంటర్‌ప్రైజెస్, జనరేషన్ ఆర్బిట్, టెర్మినల్ వెలాసిటీ ఏరోస్పేస్ అనే రెండు స్టార్టప్‌లలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు.గతంలో హై స్పీడ్ పాయింట్ టు పాయింట్ ట్రాన్స్‌పోర్టేషన్‌పై దృష్టి సారించిన ఫాస్ట్ ఫార్వర్డ్ ఇండస్ట్రీ గ్రూప్ ఏర్పాటుకు చరణీయా నాయకత్వం వహించారు.నాసా ఇన్నోవేటివ్ అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ ఫెలో, లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ అనాలిసిస్ గ్రూప్ కమర్షియల్ అడ్వైజరీ బోర్డులోనూ ఆయన పనిచేశారు.
ఇదిలావుండగా.గత మంగళవారం కనీసం అర డజను మంది భారతీయ అమెరికన్‌లను కీలక పరిపాలనా స్థానాలకు అధ్యక్షుడు బైడెన్ తిరిగి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే వీటికి సెనేట్ ఆమోదం లభించాల్సి వుంది.తిరిగి నామినేట్ చేసిన వారిలో రిచర్డ్ వర్మ (డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్), డాక్టర్ వివేక్ హల్లెగెరె మూర్తి (ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అమెరికా ప్రతినిధి), అంజలి చతుర్వేది (జనరల్ కౌన్సెల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్న్ అఫైర్స్), రవి చౌదరి (ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీ), గీతా రావు గుప్తా ( గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూ రాయబారి), రాధా అయ్యంగార్ ప్లంబ్ (డిఫెన్స్ అండర్ సెక్రటరీ)వున్నారు.