ఇక ఈ ఏడాది అంతర్జాతీయ ప్రయాణాలు లేనట్లే..!!

దేశంలో లాక్‌డౌన్ ఆంక్షలు నెమ్మదిగా ఎత్తివేస్తుండటంతో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆశలు పెట్టుకున్న వారిపై కేంద్రం నీళ్లు చల్లింది.కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలపై నిషేధాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పొడిగించింది.

ఈ ఏడాది ఆఖరు వరకు అన్ని రకాల వాణిజ్య విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.2020 డిసెంబర్ 31 అర్థరాత్రి 11.59 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని డీజీసీఏ తన ఆదేశాల్లో తెలిపింది.భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండో దశ కొనసాగుతున్న నేపథ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అయితే పరిమిత రూట్లలో తాము అనుమతించిన ప్రత్యేక విమాన సర్వీసులకు ఈ నిషేధం వర్తించదని డీజీసీఏ పేర్కొంది.అలాగే కార్గో విమానాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపింది.

కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా భారత ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి అన్ని రకాల అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇప్ప‌టికీ క‌రోనా విజృంభణ త‌గ్గ‌క‌పోవ‌డంతో ప‌లు ద‌ఫాలుగా గ‌డ‌వును పొడిగిస్తూ వ‌చ్చింది.

ఇంతకు ముందు విధించిన గడువు నవంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో.మరోసారి గడువును పొడిగిస్తూ డీజీసీఏ తాజాగా గురువారం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

అయితే భారతీయుల అవసరాల దృష్ట్యా భారత ప్రభుత్వం పలు దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది.దీని ప్రకారం ఎంపిక చేయబడిన క్యారియర్లు ఇరు దేశాల మధ్య విమానాలు నడపడానికి అనుమతి ఉంటుంది.తాజా సమాచారం ప్రకారం భారత్ ప్రస్తుతం 21 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కలిగి ఉంది.వాటిలో.

ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నైజీరియా, రువాండా, టాంజానియా, నెదర్లాండ్స్, కెనడా, ఇరాక్, ఒమన్, ఉక్రెయిన్‌లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు