తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయని హరీశ్ రావు తెలిపారు.
ఎన్నికల కోడ్ పై తోసే ప్రయత్నం జరుగుతుందని అనిపిస్తోందని పేర్కొన్నారు.ఫిబ్రవరి చివరి నాటికి ఆరు పథకాలు అమలు అయితేనే ఇబ్బంది ఉండదని చెప్పారు.
లేని పక్షంలో మరో మూడు లేదా నాలుగు నెలలు ఆగాల్సి వస్తుందని తెలిపారు.ఫిబ్రవరిలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకపోతే వంద రోజుల్లో అమలు కావన్నారు.
అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే ఆరు గ్యారంటీల అమలు సాధ్యం కాదన్న హరీశ్ రావు ఎన్నికల తరువాత కూడా ఎగవేతలే ఉంటాయని అనుమానం వ్యక్తం అవుతుందని తెలిపారు.ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాక ముందే ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు, మార్గ దర్శకాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.