సాధారణంగా మనం ప్రయాణించే ట్రైన్ లో రాత్రిపూట లైట్లు హారర్ సినిమాలో లాగా వెలుగుతూ మలుగుతూ ఉంటే భయమేస్తుంది కదా అదే భయంకరమైన శబ్దం వింటే ఇంకా భయం పెరుగుతుంది.అంతేకాదు, ట్రైన్‌లో జాంబీలు కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి! వణుకు పుడుతుంది కాదు, ఇది కేవలం ఒక ఊహ కాదు.
జపాన్‌లో ఇటీవల జరిగిన హాలోవీన్ పార్టీలో( Halloween party ) ఇలాంటి భయంకరమైన దృశ్యం కనిపించింది.
ఏటా అక్టోబర్ 31న జరుపుకునే హాలోవీన్ పర్వదినాన్ని జపాన్‌లో( Japan ) ఈసారి భిన్నంగా జరుపుకున్నారు.
అక్టోబర్ 19న, ఒక బుల్లెట్ రైలులో జాంబీలను తీసుకువచ్చి ప్రయాణికులను భయపెట్టారు.ఈ కార్యక్రమాన్ని కొవాగారాసెటై అనే సంస్థ రైల్వే అధికారులతో కలిసి నిర్వహించింది.ఈ రైలు టోక్యో నుంచి షిన్-ఓసాకా స్టేషన్‌కు( Shin-Osaka Station ) వెళ్ళింది.ఈ రైలులో దాదాపు 40 మంది జాంబీలుగా వేషధారణ చేసుకుని ప్రయాణించారు.
ఈ ట్రైన్‌లో జాంబీలను పెట్టి ప్రయాణికులను భయపెట్టడం ద్వారా ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు.
ఈ ట్రైన్ జర్నీ మొదలైన వెంటనే, ఒక బోగీలో కొంతమంది నటులు జాంబీలుగా మారిపోయారు.నకిలీ రక్తం, చైన్‌సా వంటి వాటిని ఉపయోగించి నిజంగానే జాంబీల ఆక్రమణ జరుగుతున్నట్లుగా అనిపించేలా చేశారు.ఈ ప్రయాణంలో పాల్గొన్న ప్రయాణికులు ఈ దృశ్యాన్ని చాలా ఆనందించారు.
ప్రయాణికుడు జోషువా పేన్ మాట్లాడుతూ, “నేను ఒక సినిమాలో ఉన్నట్లు అనిపించింది.అంతా నా కళ్ల ముందే జరుగుతున్నట్లు అనిపించింది” అని అన్నారు.2016లో వచ్చిన దక్షిణ కొరియా సినిమా ‘ట్రైన్ టు బుసాన్’ ( Train to Busan )చూసి ఈ జాంబీ ఆలోచన చేశారు.
జపాన్‌లోని బుల్లెట్ రైలు ఈ ఏడాది 60వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.ఈ వేడుకల్లో భాగంగా రెండు గంటల పాటు జరిగిన జాంబీ రైలు ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది.ఈ ప్రయాణంలో భయంకరమైన జాంబీలతో పాటు, జాంబీ చీర్ లీడర్లు, మాంత్రికులు, హాస్యనటులు కూడా ఉండటంతో ప్రయాణికులు చాలా సరదాగా గడిపారు.
ఈ రకమైన ప్రత్యేక ప్రయాణానికి ఖర్చు కూడా ఎక్కువే.ఈ రెండు గంటల జాంబీ రైలు ప్రయాణానికి టిక్కెట్ ధర 50,000 యెన్లు (సుమారు రూ.29 వేలు).అయినప్పటికీ, చాలా మంది ప్రయాణికులు ఈ సరదా కోసం ఖర్చు చేయడం విలువైనదని భావించారు.