యాదాద్రి భువనగిరి జిల్లా: డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత అక్కడ లేకుండా వెళ్లిపోవడంతో ఓ మహిళ ప్రాణం పోయిన విషాద సంఘటన సోమవారం అర్థరాత్రి జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురం గ్రామానికి చెందిన కొల్లు మహేష్ భార్య మానస(25) రెండవ కాన్పు కోసం ఆగష్టు 4 సాయంత్రం రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో జాయిన్ అయింది.
ఆమె గర్భం దాల్చిన రోజు నుండి ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా ప్రియాంక దగ్గరే వైద్య పరీక్షలు చేయించుకుంటుంది.సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మానసకు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా ప్రియాంక, అనస్తేషియా డాక్టర్ లింగ ఆపరేషన్ నిర్వహించగా పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది.
అయితే ఆపరేషన్ తర్వాత డాక్టర్ ప్రియాంక మానస పరిస్థితిని అబ్జర్వేషన్ చేయకుండా వెంటనే హాస్పిటల్ నుండి వెళ్లిపోయింది.సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మానసకు తీవ్రమైన రక్తస్రావం ఆరోగ్య పరిస్థితి క్షీణించి,ప్రాణాపాయ స్థితికి చేరింది.
కంగారుపడ్డ కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ సహాయంతో నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినా దిక్కుతోచని స్థితిలో నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు మానసను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ చేశారు.
కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మృతదేహాన్ని నల్లగొండ నుండి రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించి,ఆసుపత్రి ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా మృతురాలి బంధువులు మాట్లాడుతూ డాక్టర్ వెళ్ళిపోకుండా పరీక్షించి ఉంటే తమ బిడ్డ బ్రతికేదని,కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణం పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి వారిని విధుల నుండి తొలగించాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.దీనితో ఆసుపత్రి ముందు ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.