యాదాద్రి భువనగిరి జిల్లా: కొమ్మాయిగూడెం రామన్నపేట( Ramannapeta ) సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకోవడానికి ఇప్పుడు కళ్ళు తెరవకుంటే భవిష్యత్ అంధకారం కావాల్సిందేనని అఖిలపక్ష నాయకులు,తెలంగాణ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాపోలు నరసింహ హెచ్చరించారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ మండపంలో గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రై ఫోర్ట్, లాజిస్టిక్ కంపెనీ పెడతామని చెప్పి రైతుల నుండి సేద్యంలో ఉన్న భూములు కొనుగోలు చేసి ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామనడం ఇక్కడ రైతులను ప్రజలను మోసం చేసినట్లేనన్నారు.సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటయితే 20 కిలోమీటర్ల వరకు దుమ్ము,దూళి గాలి ద్వారా వ్యాపించి ఊర్లన్నీ దుమ్ముమయం అవుతాయని,చేనేతకు కేంద్రమైన సిరిపురం గ్రామంలో నాణ్యమైన వస్త్రాలను తయారు చేసినా దుమ్మే పేరుకొని ఉంటుందన్నారు.70,80 లక్షలు పలుకుతున్న ఎకరం భూమి 10 లక్షలకు కూడా ఎవరు కొనరని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రశాంతంగా జీవిస్తున్న ఈ ఊరు ప్రజలు సిమెంటు కాలుష్యం వల్ల రోగాల బారిన పడి చెట్టుకొక్కరూ, పుట్టకొక్కరుగా కావలసి వస్తుందన్నారు.
ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.ఈనెల 15న అఖిలపక్షం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు సమావేశానికి తరలివచ్చి ప్రతిన బూనాలని,23న ప్రజాభిప్రాయ సేకరణకు తరలివచ్చి అడ్డుకోవాలన్నారు.
ఆదానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కనక ఏర్పాటు అయితే తర్వాత మనం చేసేదేమి ఉండదని,ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందేనన్నారు.పార్టీలను పక్కకు పెట్టి స్వచ్ఛందంగా తరలిరావాలని,అందరం బాగుంటే మనకు నచ్చిన పార్టీలో పని చేయవచ్చునన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బడుగు రమేష్, మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్స్,నాయకులు రాపోలు రామేశ్వరం, గోశిక చక్రపాణి,గుండు శీను తదితరులు పాల్గొన్నారు.