హువావీ తన సొంత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తుంది.అగ్రరాజ్యం అమెరికా,చైనా ల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ ఇటీవల టెక్ వార్ గా మారిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో గూగుల్ హువావీ ఉత్త్పత్తులకు ఎలాంటి సేవలు అందించమని ప్రకటించడం తో ఇప్పడు ఈ వార్ మరింత తారాస్థాయి కి చేరుకుంది.అయితే గూగుల్ ఇంతటి నిర్ణయం తీసుకున్నా కూడా హువావీ ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం ఉన్న హువావీ, హానర్ ఫోన్లకు తమ సెక్యూరిటీ ప్యాచ్ లు, విక్రయానంతర సేవలను అందిస్తామని ప్రకటించింది.అయితే హువావీ ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఎప్పటికైనా వస్తుందని ఊహించిందేమో గాని 2012 నుంచి తన సొంత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తూ వచ్చినట్లు తెలుస్తుంది.

హువావీ హాంగ్ మెంగ్ ఓఎస్ పేరుతో తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారుచేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ప్రస్తుతం ఈ ఓఎస్ ప్రయోగాత్మక దశలో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి.దీనికి ముందు హువావీ తన ప్రాసెసర్ల పేరుతోనే కిరిన్ ఓఎస్ అనే సొంత ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేస్తున్నట్టు పుకార్లు షికారు చేసినప్పుడు చైనా మొబైల్ ఫోన్ల తయారీదారైన హువావీ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ ఫి అమెరికాపై మండిపడ్డారు.‘మా బలాన్ని’ తక్కువగా అంచనా వేసి అమెరికా నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చైనీస్ ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీతో అన్నారు.
అమెరికా ప్రభుత్వం గూగుల్ సర్వీసులు పొందేందుకు హువావీకి 90 రోజుల గ్రేస్ పీరియడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.