బీఆర్ఎస్ ను కేసీఆర్ ( KCR )ను ఇరుకున పెట్టే విధంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ).ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కేసీఆర్ కారణమని ఆ పార్టీ మొదటి నుంచి ప్రచారం చేసుకుంటూనే ఉంది.
ఉద్యమ క్రెడిట్ మొత్తం కేసీఆర్ కే ఉండే విధంగా బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూనే ఉంది.ఆ సెంటిమెంట్ తోనే రెండుసార్లు తెలంగాణలో అధికారం చేపట్టింది.
అయితే మూడోసారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడంతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.ఇక పూర్తిగా బీఆర్ఎస్, కెసిఆర్ ( BRS, KCR )హవాను తగ్గించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ లు వేస్తున్నారు.
దీనిలో భాగంగానే తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పు చేర్పులు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.ఈ మేరకు తెలంగాణ అధికారిక చిహ్నాన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.ఈ లోగోలో అమరవీరుల స్తూపం, వరి కంకులతో పాటు, దేశానికి గర్వకారణమైన అశోక చక్రం ఉండనున్నట్లు సమాచారం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించిన రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని, కొత్త లోగోలో అమరవీరుల స్తూపం వరి కంకులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోటు కల్పించడం వెనుక బీఆర్ఎస్ ను కట్టడి చేయాలన్న ఆలోచన కారణంగా తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసిఆర్ ద్వారానే సాధ్యమైందని, బీఆర్ఎస్ చేసుకుంటున్న ప్రచారానికి చెక్ పెట్టే విధంగా కేసీఆర్ ఒకరితోనే స్వరాజ్యం ఏర్పడలేదని, అనేకమంది అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ అని గుర్తు చేసే విధంగా అమరవీరుల స్థూపానికి లోగోలో స్థానం కల్పించినట్లుగా అర్థమవుతుంది.
అలాగే తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి రైతులు కేసీఆర్ ను ఆరాధిస్తూ ఉండడంతో, కెసిఆర్ ను మించి వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పే విధంగా తెలంగాణ ప్రజల ప్రధాన వృత్తి అయిన వ్యవసాయం పాడిపంటలతో చిహ్నం ఉండేలా రేవంత్ రెడ్డి మార్పులు సూచించినట్లు తెలుస్తోంది.