నా గుండెల్లో నా తల్లిదండ్రులకున్న స్థానం కార్యకర్తలకు ఉంది ఎవరి మాటలో నమ్మి నన్ను దూరం చేసుకోవద్దు అనకాపల్లి నుంచే పోటీ చేస్తా.నా ఎలక్షన్ నిర్వహణ బాధ్యత మీదే ఐదు నెలల కష్టపడితే మళ్ళీ ఐదేళ్ల అధికారం మనదే ప్రాణం పోయినా అవినీతికి పాల్పడను భావోద్వేకపూరిత ప్రసంగం చేసిన మంత్రి అమర్నాథ్( Gudivada Amarnath ) ,అనకాపల్లి ఇప్పటివరకు ఒక లెక్క.
ఇప్పటినుంచి ఒక లెక్క.ఇది సినిమా డైలాగ్ కావచ్చు.
కానీ ఇప్పుడు ఇది మంత్రి అమర్నాథ్ ట్యాగ్లైన్ గా మారింది.మంగళవారం స్థానిక రోటరీ కళ్యాణ మండపంలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన ప్రసంగం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఎప్పుడు కూల్ గా సాగే ఆయన ప్రసంగం ఈరోజు ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా కనిపించింది.
సుదీర్ఘంగా సాగిన తన ప్రసంగంలో అమర్నాథ్ అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని, కార్యకర్తలే తన బలమని, చెప్పుడు మాటలు విని తనను దూరం చేసుకోవద్దు అంటూ భావోద్వేగంతో చేసిన ప్రసంగం పలువురిని ఆలోచింపజేసే విధంగా చేసింది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నా మీద నమ్మకం ఉంటే నాతో ఉండండి.నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ దూరం చేసుకోను.
పలకరించలేదనో.లేక పట్టించుకోలేదనో నన్ను దూరం చేసుకోవద్దు.నా గుండెల్లో నా తల్లిదండ్రులకు ఏ స్థానం ఉందో అంతకుమించి నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు ఉంది.” అని అమర్నాథ్ అన్నారు.మీపై ఉన్న అభిమానాన్ని బహిర్గతం చేయలేకపోయినా, మీకు కష్టం వస్తే ఆదుకోవడానికి నేనున్నాను అని అమర్నాథ్ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.నన్ను నమ్ముకున్న వారందరికీ ఏదో ఒక సమయంలో తగిన హోదా కల్పిస్తానని, ఇప్పటికే ఇది పలు సందర్భాల్లో రుజువైందని అమర్నాథ్ తెలియజేశారు.
అనకాపల్లి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదవుల కేటాయింపులలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, ఆయా నాయకులు కార్యకర్తలు సంప్రదింపులు జరుపుకొని తన దగ్గరికి వచ్చిన తర్వాతే ఆయా పదవులనుభర్తీ చేశానని అమర్నాథ్ వెల్లడించారు.
ఇది ఇలా ఉండగా వచ్చే ఎన్నికల్లో తన అనకాపల్లి నుంచే పోటీ చేస్తానని, కార్యకర్తలే నా ఎలక్షన్ నిర్వహణ బాధ్యతను తీసుకోవాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.రాజకీయాల్లో ఓపిక అవసరమని, సమయం వచ్చినప్పుడు పదవులు అంది వస్తాయని ఆయన అన్నారు.2016లో నా వెంట 26 మంది మాత్రమే ఉన్నారు.నా వెంట తిరగడానికి చాలామంది భయపడ్డారు.కానీ మొక్కవోని ధైర్యంతో రాజకీయ ప్రయాణం సాగించిన తనతో ఒక్కరొకరుగా కలిసి కలిసి వచ్చారని అమర్నాథ్ అన్నారు.పార్టీ పై నాయకులలో నమ్మకం ఉంటే కార్యకర్తల్లో కూడా ఉంటుందని అమర్నాథ్ అన్నారు.ఇదిలా ఉండగా తాను అవినీతికి పాల్పడుతున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రాణం పోయినా అవినీతికి పాల్పడబోనని అమర్నాథ్ స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని కార్యకర్తలంతా కాలర్ ఎగరేసి మరీ చెప్పచ్చని అమర్నాథ్ అన్నారు.
తానేదో భూ కుంభకోణానికి పాల్పడ్డానని అంటూ దాన్ని నిరూపించడానికి వచ్చిన ఒక సినిమా యాక్టర్, కేవలం నాలుగు నిమిషాలు ఇక్కడ ఉండి నిరూపించలేక పలాయనం చిత్తగించారని ఆయన అన్నారు.
నోరు ఉందని ఇష్టానుసారంగా తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని అమర్నాథ్ హెచ్చరించారు.తనపై అవినీతి మరక పడకూడదని, ఎదుటివారి వద్ద తలదించుకోకూడదన్న భావన తనలో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుందని అమర్నాథ్ స్పష్టం చేశారు.
మా తాత, తండ్రి ఇచ్చిన రాజకీయ వారసత్వాన్ని తాను కొనసాగిస్తూ వస్తున్నానని వారికి మచ్చ తెచ్చే పని చేయనని అమర్నాథ్ చెప్పారు.త్వరలోనే అనకాపల్లి( Anakapalle )కి తాను మకాం మారుస్తానని అమర్నాథ్ తెలియజేశారు.
ఇదిలా ఉండగా స్వతంత్ర భారతదేశంలోఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూలేని విధంగా వైఎస్ఆర్సిపికి ఎనిమిది లక్షల మంది సైన్యం ఉందని, దేశంలోని మరే ఇతర పార్టీకి ఇంత బలం లేదనిఅమర్నాథ్ చెప్పారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పాలనలో వ్యవస్థలో అనేక మార్పులు జరిగాయని సంక్షేమం, అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగిందని ఆయన అన్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను తాము అధికారంలోకి వస్తే తొలగిస్తామని ఏ రాజకీయ పార్టీకైనా దమ్ముంటే చెప్పాలని, జగన్మోహన్ రెడ్డి పథకాలను ముట్టుకునే ధైర్యం ఎవరు చేయలేరని అమర్నాథ్ స్పష్టం చేశారు.ప్రతిపక్షాల మాటలను జనం నమ్మడం మానేశారని, జగన్ మోహన్ రెడ్డి సంక్షేమం పైనే ప్రజలు నమ్మకం ఉంచారని ఆయన చెప్పారు.
తమకు కష్టం వస్తే జగనన్న ఉన్నాడన్న ధైర్యం ప్రజల్లో ఉందని అన్నారు.జగన్ కళ్ళలో ఎప్పుడు భయం చూడలేదు.
అది చాలదా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి.వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి.
అని అమర్నాథ్అన్నారు.వచ్చే ఐదు నెలలు కష్టపడితే ఆ వచ్చే ఐదు ఏళ్ళు మనదే అధికారం అని అమర్నాథ్ నాయకులను, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేశారు.