కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.
ఇకపోతే లాక్ డౌన్ సమయంలో సూర్య నటించిన జై భీమ్ చిత్రం ఎంతటి మంచి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా మంచి విజయంతో పాటు ఎన్నో వివాదాలు కూడా ఎదుర్కొంటుంది.
ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు వన్నియర్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఈ సన్నివేశాలను తొలగించాలని అదే విధంగా ఈ సినిమా దర్శక నిర్మాతలు, హీరో పై కేసు నమోదు చేయాలని వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ విషయంపై పోలీసులు ఎవరిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ తాజాగా ఈ విషయం గురించి స్థానిక సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో ఇదే విషయమై పిటిషన్ దాఖలు చేశారు.

ఈ విషయంపై విచారణ జరిపిన అనంతరం కోర్ట్ హీరో సూర్య నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు.ఈ విధంగా వీరి పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సమర్పించాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు దర్శక నిర్మాతలతో సహా హీరో సూర్య పై కూడా నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో భాగంగా హీరో సూర్య పై5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు.అయితే బహిరంగంగా హీరో సూర్య క్షమాపణలు చెబితే నష్టపరిహారాన్ని ఉపసంహరించుకుంటామని వన్నియర్ సేన ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.