చీరాల రైల్వే స్టేషన్( Chiral Railway Station ) లో కొందరు యువకులు నల్లకోటు ధరించి టీటీఈలుగా వ్యవహరిస్తూ, టికెట్ లేని వారిపై కేసులు రాస్తూ స్థానిక టీటీఈ కు అడ్డంగా దొరికిపోయి జైలు పాలు అయిన సంగతి తెలిసిందే.పోలీసులు వీరిని తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
వరంగల్ జిల్లాకు చెందిన గణేష్, కళ్యాణ్, మహబూబాబాద్ కు చెందిన ప్రవీణ్ అనే యువకులు డిగ్రీ వరకు చదివి నిరుద్యోగులుగా ఉన్నారు.వీరికి తెనాలికి చెందిన సాయి ప్రసాద్ ( Sai Prasad )అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.
రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారి వద్ద రూ.లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు.

ఇక వారికి టీటీఈ ఉద్యోగం వచ్చినట్లు నమ్మించి నకిలీ ఐడి కార్డులు ఇచ్చాడు.అంతేకాకుండా జరిమానా రాసే పుస్తకాలు ఇచ్చి విజయవాడ-ఒంగోలు మధ్య తిరిగే రైళ్లలో రోజుకు కనీసం మూడు కేసులు రాయాలని ఇది శిక్షణలో ఒక భాగం అని వారిని నమ్మించాడు.ఈ విషయం విని ఆ నిరుద్యోగులు ఎంతో సంతోషించారు.నల్లకోటు ధరించి రైళ్లల్లో తిరుగుతూ టికెట్ లేని ప్రయాణికులకు జరిమానా వేసి, ఆ డబ్బులు తెచ్చి సాయిప్రసాద్ కు ఇచ్చేవారు.
ఈ క్రమంలోనే చీరాల రైల్వే స్టేషన్ లో కేసులు రాస్తున్న గణేష్ స్థానిక టీటీఈ రాజేష్ కు కనిపించాడు.అనుమానం వచ్చి ప్రశ్నించగా గణేష్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వెంటనే రాజేష్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

రైల్వే పోలీసులు గణేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తనతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని చెబితే వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.తెనాలికి చెందిన సాయి ప్రసాద్ ( Sai Prasad )అనే వ్యక్తి డిగ్రీ చదివిన నిరుద్యోగులకు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి, లక్షల్లో డబ్బులు తీసుకుంటూ ట్రైనింగ్ లో భాగంగా జరిమానాలు వసూలు చేసి తెమ్మంటున్నాడనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.ప్రస్తుతం పరారీలో ఉన్న సాయి ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.సాయి ప్రసాద్ దొరికితే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.







