సంస్థాన్ నారాయణపురం మండలంలో గ్రామ పంచాయతీల బిల్లులు పెండింగ్లో ఉండడంతో మాజీ సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.గతంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో పదవిలో ఉన్నప్పుడు జోరు మీదున్న వివిధ గ్రామాల సర్పంచులు అప్పులు చేసి ఎన్నో కాంట్రాక్టులను తీసుకుని గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేశారు.
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఎంతో కొంత కాంట్రాక్టర్లకు(contractors) ఇస్తూ తీసుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగారు.అనంతరం ప్రభుత్వం మారడంతో అభివృద్ధికి చేసిన బిల్లులు(bills) పెండింగ్లో ఉండడంతో నేడు బేజారు అవుతున్నారు.
ఎన్నోసార్లు ప్రభుత్వానికి నోటీసులు, వినతులు ఇస్తూ,ధర్నాలు చేసినా వారి గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.ఈ నేపథ్యంలో సంస్థాన్ నారాయణపురం మండలంలోని ఓ గ్రామానికి సర్పంచ్ గా ఉన్న వ్యక్తి రాష్ట్ర స్థాయిలో పదవిలో ఉండి కూడా సర్పంచులకు న్యాయం చేయలేకపోయామని.
వాపోతున్నారు.నాటి ప్రభుత్వంలో అభివృద్ధి చేద్దామని అనుకున్నామని,కానీ, ప్రభుత్వం మారడంతో తమకు పరేషాన్ మాత్రమే మిగిలిపోయిందని అంటున్నారు.ఇలాంటి పరిస్థితిని చూసి రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో అభ్యర్థులకు గుండెల్లో గుబులు కూడా పుట్టే అవకాశం ఉంటుందని,పెండింగ్ లో ఉన్న సర్పంచుల బిల్లులు విడుదల చేయకపోతే పంచాయితీ రాజ్(Panchayat Raj) వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని,కొత్తగా వచ్చే వారు అభివృద్ది చేయడానికి ఆలోచించే అవకాశం ఉంటుందని, వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టాక్ వినిపిస్తుంది.ఏది ఏమైనా కొత్త సర్పంచులు వచ్చేదాకా బిల్లుల కోసం వేచి చూడాలా,లేక అసలు వస్తాయా రావా అనే నిరాశలో మాజీలు మదన పడుతున్నారు.







