తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు కీలక మార్పులతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కు ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ప్రస్తుతం పరిస్థితి ఉంది.
అయితే సమ్మక్క- సారక్క ఉత్సవాల విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని, అదే విధంగా ఉగాది వేడుకలకు హాజరుకాకపోవడంతో వివాదం మరింత ముదరడంతో గవర్నర్ తమిళి సై వ్యవహారం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.అయితే నేడు శ్రీరాముల వారి కళ్యాణం సందర్బంగా భద్రాచలంకు గవర్నర్ తమిళి సై రానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రభుత్వం ప్రోటోకాల్ పాటిస్తుందా లేదా అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇటీవల గవర్నర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడిపిస్తానని చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన నేపథ్యంలో భద్రాద్రి రామాలయం దగ్గర గవర్నర్ కు దక్కాల్సిన మర్యాదలు దక్కుతాయా లేక క్రితం పరిస్థితే కొనసాగుతుందా అనేది మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.
అయితే ఇప్పట్లో గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తొలిగిపోయే అవకాశం కనిపించడం లేదు.అంతేకాక భద్రాద్రిలోని ఓ గిరిజన తండాను కూడా కలిసే అవకాశం ఉండటంతో ఇక రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
అయితే గవర్నర్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కెసీఆర్ పూర్తి స్థాయిలో స్పందించకపోవడంతో ఇంకా ఈ విషయం చాలా సాధారణ అంశంగానే మిగిలిపోతున్న పరిస్థితి ఉంది.అయితే ఢిల్లీలో వరి ధాన్యం కొనుగోలు నిరసన దీక్ష తరువాత నిర్వహించే మీడియా సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల కెసీఆర్ తప్పకుండా స్పందించే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.