చాలాకాలం తరువాత భాజపా కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ వార్తల్లోకొచ్చారు.వస్తూనే ప్రకంపనలు సృష్టించారు.‘దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) వస్తుందేమోనని భయంగా ఉంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం కలిగిస్తున్నాయి.ఆయన సొంత పార్టీ అధికారంలో ఉన్న పరిస్థితిలో అద్వానీ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అన్ని పార్టీలకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రజాస్వామ్యానికి హాని చేసే కొన్ని శక్తులు బలపడుతున్నాయని అద్వానీ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భాజపా మంత్రులు, ఎంపీలు వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
మతాల మధ్య చిచ్చుపెట్టేవిధంగా మాట్లాడుతున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకునే అద్వానీ మాట్లాడారని అనుకుంటున్నారు.
అందులోనూ ప్రధాని మోదీ కూడా నియంతృత్వ పోకడలుపోతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఇది కూడా అద్వానీ దృష్టిలో ఉంది.
ఒకప్పుడు అత్యంత సన్నిహితులైన మోదీ, అద్వానీ ఇప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉన్న సంగతి తెలిసిందే.అద్వానీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలను మోదీ ప్రత్యర్థులు స్వాగతిస్తున్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అద్వానీ వ్యాఖ్యలను సమర్థించారు.మరి మోదీ ఏమనుకుంటున్నారో తెలియదు.








