ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు లాంటివి.ఎన్నికల వ్యవస్థ భారత దేశంలో స్వతంత్ర ప్రత్తి గల సంస్థ.
ఎన్నికలు లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ఉండదు.భారత దేశం లో ఎన్నికలు అనేవి ఓ ప్రహసనం లాంటివి.
భారత్ లో ఎన్నికలకు అయ్యే ఖర్చు అపారం.ఈ డబ్బుతో ఓ చిన్న దేశాన్ని బాగుపరచవచ్చు.
ఇటీవల కాలంలో వచ్చిన మార్పులు మూలంగా ఎన్నికలు ప్రజలలో ఓ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.అదేమిటంటే డబ్బు ఈరోజుల్లో ఎవరు ఎక్కువ వెదజల్లుతారో వారే విజయం సాధించడం జరుగుతోంది.
డబ్బు ఇవ్వడం అనేది రాజకీయ పార్టీలే ప్రజలకు నేర్పించారు.గతంలో ఏ రాజకీయ పార్టీల నాయకులు కాని కార్యకర్తలు కాని ప్రజల గృహాల దగ్గరకు వచ్చి డబ్బు అందే ఏర్పాటు చేయలేదు.
ఓట్లు వేయమనే అడిగేవారు.కాని రాను రాను ఎన్నికలలో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తోంది.
నాయకుడు ఎలాంటి వాడో చూడటం లేదు.ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ డబ్బిస్తే వాళ్ళే గెలవడం కద్దు.
స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలు మొదటిసారిగా 1951 లో జరిగాయి.అప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అప్పుడే రాష్టాలలో ఎన్నికల పట్ల ప్రజలు అప్రమత్తమయ్యారు.పప్రథమ ప్రధాని జవహార్ లాల్ నెహ్రు నుంచి నేటి నరేంద్రమోడీ వరకు ఈ ప్రస్థానం సాగింది.
అయితే ఎవరూ ఎన్నికలలో సంస్కరణలు తీసుకు రాలేదు.తీసుకు వచ్చిన సంస్కరణలు సక్రమంగా అమలు కావడం లేదు.నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో కొన్ని సంస్కరణలు తీసుకు వచ్చినా,పాత సంస్కరణల స్థానం లో నూతన సంస్కరణలు రావడానికి అవకాశం ఉండాలి.ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు సాధారణ కమిషనర్ లు ఉంటారు.
వీరి పదవీ కాలం ఆరేళ్ళు లేదా అరవై అయిదు సంవత్సరాలు.ఇందులో ఏది ముందు వస్తే అది.తరచి చూస్తే 2004 నుంచి ఒక్క సీ.ఈ.సీ.కూడా తమ ఆరు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు.ప్రధాన ఎన్నికల కమిషనర్లను నియమించాలి అంటే ఓ వ్యవస్థ ఉండాలి.ఎన్నికల కమిషనర్లు నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి అనే అభిప్రాయం ఉంది.సర్వోత్తముడైన వ్యక్తిని ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉండాలని చెప్పింది.ఎన్నికల ప్రధాన కమిషనర్ సంస్కరణలు ప్రోది చేసే వ్యక్తి అయి ఉండాలని అభిప్రాయ పడింది.
ఇంతవరకు ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురాగలిగిన వ్యక్తి శేషన్.ఆయన ఒక్కరే చేసిన సంస్కరణలు ఆమోదింపదగినవి.
ముఖ్యంగా ఓటర్లు కు గుర్తింపు కార్డ్స్ ఆయన హయాంలో ప్రవేశ పెట్టినదే.ఆ సంస్కరణే ఇప్పటికీ నడుస్తోంది.
రాజ్యాంగం ఎన్నికల సంఘం పై అపారమైన అధికారాలను మోపింది.అధికారాలు అయితే ఇచ్చింది కాని ఇప్పటికి ఇంకా తగిన సంస్కరణలు లేకపోవడం శోచనీయం.

ఏదో ఎన్నికల సంఘం కు కమిషనర్ గా ఉన్నాం అని అదే మాకు క్రెడిట్ అనే విధంగా నేటి ఎన్నికల సంఘం భావిస్తున్నట్లుగా ఉంది.ఎన్నికల కమిషన్ తీరును పరిశీలిస్తే 2004 నుంచి ఒక్క సి.ఈ.సి కూడా ఆరు సంవత్సరాలు పదవీ కాలం పూర్తి చేయలేదు.వచ్చిన వాళ్ళు ఏదో స్వల్ప కాలానికి నియమించబడి మొక్కు బడిగా చేస్తున్నారు.అందుకే ఎన్నికల సంఘం కు దృఢమైన వ్యక్తులు రావాలని,ఓ స్పష్టమైన విధానం ఉండాలని తెలుస్తోంది.
ఇప్పుడు సంస్కరణలు చేయాలంటే కమీషన్ కు కత్తి మీద సాము లాంటిదే.కమిషనర్లును నియమించేది రాష్ట్ర పతి అయినా ప్రధాన మంత్రి, మంత్రి వర్గం ఎన్నిక చెయబడిన వారే ఉంటారు.
కమిషనర్లు అందరూ ప్రధానికి దగ్గర వాళ్ళే అని స్పష్టమవుతోంది.ప్రధాన కమిషనర్, సాధారణ కమిషనర్లు గల వ్యవస్థ ‘నిర్వాచన్ సదన్’ కు అత్యవసర మని,కమిషనర్లు ఎంపిక సరైన విధానంలో రూపొందించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి కి సూచించింది.ఎన్నికలలో అనేక లోపాలు ఉన్నాయి.
ఇది తెలిసి చేస్తున్నారో,తెలియక చేస్తున్నారో అర్ధం కావడం లేదు.భారత దేశం లో చాలా వరకు ఎన్నికలలో డబ్బు విచ్చలవిడిగా పెడతారు.
ఇంకా రిగ్గింగ్ కు పాల్పడటం, ముఖ్యంగా మద్యం పంచడం మొదలగు వాటికి పాల్పడుతున్నారు.దీనిని అరికట్టాలి.
ముఖ్యంగా కులం, మతం ఇవి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి.దానికి తోడు ఓటర్లు కూడా తమ కులం వారికి ,తమ మతం వారికే ఓటు వేస్తున్నారు.
ఈ విధానం పోవాలి.నాయకుల గుణగణాలు ఓటర్లు చూడాలి.
ఎన్నికల్లో ప్రధానంగా అంగబలం,ఆర్ధిక బలం ఉన్న వారు పోటీ చేస్తుండటంతో ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం అయి పోతుంది.

ఎన్నికల లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.వీటిని అరికట్టాలంటే ప్రజామిక వ్యవస్థలో ఎన్నికల సంస్కరణలు ప్రస్తుతం అవసరం.అందు నిమిత్తం కొన్ని కమిటీలు తర్కండే కమిటీ, గోస్వామి కమిటీ నియమించడం జరిగింది.
ఈ కమిటీ కొన్ని సూచనలు చేసింది.వాటిలో ప్రధానంగా ఓటు వయస్సు తగ్గించడం(21నుంచి 18) ఓటర్లు కు గుర్తింపు కార్డ్స్ ఉండటం వల్ల బోగస్ ఓట్లు తగ్గించడం, ముఖ్యంగా రిగ్గింగ్ జరగకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్రవేశ పెట్టడం.
ఇవన్నీఉత్తమోత్తమమైన సంస్కరణలే అయితే ప్రధానంగా డబ్బు పంచడం అరికట్టలేక పోవడం ఎన్నికల విధానానికే అడ్డంకిగా ఉంది.ఎన్నికల్లో ఫలానా పార్టీ వారి డబ్బు దొరికింది అని వార్తలు వింటున్నామే కాని అవి ఏ పార్టీ తాలూకు అనేది కచ్చితంగా తెలడం లేదు.
మీవంటే మీవి అని నాయకులు దుమ్మెత్తి పోసుకుంటారు.అది ఫలానా పార్టీ వారి డబ్బు అని తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలి.
లేకపోతే శాశ్వతంగా ఎన్నికలకు దూరంగా ఉంచాలి.అందుకు చట్టం రావాలి,తేవాలి.
ఇటువంటి ప్రజోపకర చట్టాలు చేయరు.దీనికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలి.
అప్పుడే డబ్బు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.ఓటర్ల కు కూడా ఓ భరోసా ఉంటుంది.
ఎన్నికలలో మన దేశ గౌరవం ఇనుమడించాలి అంటే ఇంకా మరిన్ని సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది.అప్పుడే విశ్వంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ కు గౌరవం లభిస్తుంది.