తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అనే హడావుడి చాలా కాలం నుంచి జరుగుతోంది.ఈ మేరకు బీ ఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) హడావుడి పడుతూ ఉండడం, తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ( BJP ,Congress )పార్టీలు బాగా బలం పుంజుకోక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనతో కేసిఆర్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ విషయాన్ని అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.

సాధారణ ఎన్నికలకు సమయం బాగా దగ్గరకు వచ్చిన నేపథ్యంలో, ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది.ఇప్పటికే ఏపీలో ఎన్నికల కమిషన్ టీం( Election Commission Team ) పర్యటించింది.డిప్యూటీ కమిషనర్ నితీష్ నేతృత్వంలోని ఈసీ బృందం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ వికాస్ రాజ్( Vikas Raj ) , ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు.తెలంగాణలో ఓటర్ల జాబితాలో చేపట్టాల్సిన మార్పు చేర్పుల గురించి అధికారులకు అనేక ఆదేశాలు ఇచ్చారు.రిటర్నింగ్ అధికారుల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించారు.జూన్ 1 నుంచి ఈవీఎం ల మొదటి దశ తనిఖీ చేపట్టాలని ఆదేశించారు.
అలాగే జిల్లా ఎన్నికల అధికారులకు రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తామని తెలిపారు.

ఈవీఎంలను తనిఖీ చేసి అన్ని జిల్లాలకు పంపించినట్లు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.అలాగే పోలింగ్ శాతం పెరిగే విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదేశించారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒకపక్క రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన సమయంలోనే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుండడంతో ఇక పూర్తిస్థాయిలో జనాలను ఆకట్టుకునే విధంగా అన్ని రాజకీయ పార్టీలు సిడ్డమయిపోతున్నాయి.







