ఏపీ అధికార పార్టీ వైసీపీ లో అప్పుడే ఎన్నికల సందడి మొదలైపోయింది.ఇప్పటి నుంచే టిక్కెట్ల అంశంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.
దీనికి తోడు ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు బయటకు వస్తూ ఉండడంతో, నాయకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది .ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలామందిని తప్పిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో , ఆశావాహులు తెరపైకి పోస్తున్నారు.నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ, టికెట్ తమకే దక్కేలా పావులు కదుపుతున్నారు.ఇటీవల కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సర్వే వివరాలను పూర్తిగా అధ్యయనం చేసిన జగన్ ఆయా నియోజకవర్గాల్లోని వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించి గట్టిగానే క్లాస్ పీకారు.
సంక్షేమ పథకాలు పరంగాను , ప్రజా ఆమోగ్య నిర్ణయాలు తీసుకుని తాను ప్రజల్లో మంచి మార్కులు తెచ్చుకున్నానని, పూర్తిస్థాయిలో ప్రజల్లో బలం పెంచుకోకుండా, పార్టీ పైన తన పైన భారం వేస్తే కుదరదని, మరో అవకాశం ఇస్తున్నానని, కొద్ది నెలల్లోగా మీ పనితీరు మెరుగుపరుచుకుని సర్వేలో అత్యధిక మార్కులు తెచ్చుకుంటేనే టికెట్లు ఇస్తామని కొంతమంది ఎమ్మెల్యేలకు జగన్ నేరుగా చెప్పేశారు.ప్రస్తుతం మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలలో చాలామందికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కష్టం అనే వార్తలు ఇప్పుడు వైసీపీలో జోరుగా జరుగుతున్నాయి.
ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ? గ్రూపు రాజకీయాల సంగతి ఏంటి ? ఎవరెవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ? ఎమ్మెల్యేల గ్రాఫ్ ప్రజల్లో ఏవిధంగా ఉంది అనే విషయం జగన్ కు సర్వే నివేదికలు , ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అండుతున్నాయి.

దానికి అనుగుణంగానే ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి.ఎవరికి ఇవ్వకూడదనే విషయంపై ప్రాథమిక జగన్ ఒక అంచనాకు వచ్చారు.దాదాపు 25 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికల్లో గెలవడం కష్టమనే రిపోర్ట్ అందడం, ఆయా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని , పార్టీ నాయకులతోనూ సఖ్యతగా వ్యవహరించడం లేదని తేలడంతో, సదరు ఎమ్మెల్యేలకు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వకూడదని , వారికి ప్రత్యామ్నాయంగా నియోజకవర్గంలో మరో బలమైన నేతను ప్రోత్సహించాలని జగన్ డిసైడ్ అయ్యారట.
పనితీరు ఏమాత్రం బాగాలేని ఎమ్మెల్యేల లిస్ట్ పెద్దగానే ఉన్నా, ఇప్పుడిపడే వారి వైఖరిలో మార్పు రావడం, జనాల్లో తిరుగుతూ తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు విషయంలో జగన్ వైఖరిలో మార్పు వచ్చిందట.అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు అప్పుడే పక్క పార్టీల వైపు చూస్తున్నారనే విషయం సైతం తేలడంతో అటువంటి ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని, రాబోయే ఎన్నికల్లో వారికి టికెట్ ఇచ్చేదే లేదనే సంకేతాలను అప్పుడే జగన్ పంపిస్తున్నారట.
ముఖ్యంగా గడపగడపకు వైసిపి ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళుతుండడంతో, కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలలోను సానుకూల ఏర్పడింది అనే విషయాన్ని జగన్ గుర్తించారు.కానీ 25 మంది ఎమ్మెల్యేల విషయంలోనే జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.