వ్యవసాయ రంగంలో అతి కీలకమైనది నేల యొక్క స్వభావం.మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం కంటే ముందు మనం సాగు చేసే నేల ఏ ఏ పంటలకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మనం ఎటువంటి నేలలలో ఎటువంటి పంటలు వేయాలో తెలుసుకుందాం.నల్ల రేగడి నేలలు:( Black Soil ) ఈ నేలలు చాలా బరువుగా ఉంటాయి.వర్షం పడిన తర్వాత ఈ నెలలు త్వరగా ఇంకవు.నేల కూడా త్వరగా అరదు.ఈ నేలలు పండ్ల సాగుకు అనుకూలంగా ఉండవు.మొక్కజొన్న, కంది, మిరప, ఉల్లి, పొగాకు, శనగ, వరి లాంటి పంటలకు అనుకూలంగా ఉంటాయి.

ఒండ్రు నేలలు:
ఈ నేలలు చాలా సారవంతంగా ఉంటాయి.ఈ నెలలో నీరు సులువుగా ఒడిసిపోవడం వలన మురుగునీటి సమస్య అంతగా ఉండదు.ఈ నేలలో మామిడి, కొబ్బరి, పనస, సపోటా లాంటి పండ్ల తోటలు సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి.
గుల్లరాతి నేలలు:
ఈ నేలలు గుల్లగా, తేలికగా ఉండటం వల్ల నీరు సులువుగా ఇంకి పోతుంది.అధిక వర్షపాతం ఉండే చోట్ల నేల యాసిడ్ గుణాన్ని కలిగి ఉంటుంది.భారతదేశంలోని పశ్చిమ తీర ప్రాంతంలో ఈ రకం నేలలు ఎక్కువగా ఉంటాయి.ఇలాంటి నేలలలో కొబ్బరి, మామిడి, పొక, పనస( Jackfruit ) లాంటి తోటలు పెంచుకోవచ్చు.

ఎర్ర నేలలు:
ఈ నెలలు ఇటుక రంగు రూపంలో ఉంటాయి.ఎర్ర నేలలలో ఖనిజ లవణాలు తక్కువగా ఉంటాయి.ఈ నేలలు నారింజ, నిమ్మ, ద్రాక్ష పంటలకు అనుకూలంగా ఉంటాయి.
గరప నేలలు: ఈ నేలలు చాలా తేలికగా ఉండి గోధుమ/ బూడిద/ కొద్దిగా ఎరుపు రంగులో ఉంటాయి.నీటి వనరులు పుష్కలంగా ఉంటే మొక్కజొన్న, కంది, పత్తలాంటి పంటలు పండించవచ్చు.
పంట వేసే ముందు భూసార పరీక్ష చేయించుకోవాలి.భూసార పరీక్ష( Soil Testing )లో ఉదాజని సూచిక, లవణాలు, కర్బన శాతం, నత్రజని, భాస్వరం, పోటాష్ లాంటి మోతాదు వివరాలు బయటపడతాయి.పీహెచ్ విలువ 7.0 కంటే ఎక్కువగా ఉంటే ఆ నేలను క్షారత్వపు నేల అని, పీహెచ్ విలువ 7.0 కంటే తక్కువగా ఉంటే యాసిడ్ నేలలు అని అంటారు.వ్యవసాయ క్షేత్రం నిపుణుల సలహా మేరకు ఆ నేలను న్యూట్రల్ నేలలుగా తీసుకువచ్చి పంటలో పెరుగుదల, దిగుబడులను పొందవచ్చు.