వైసీపీ ప్రభుత్వం ఎన్ని ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్నా, ఎంతగా ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్న , టిడిపి ఆ పార్టీ అనుకూలం మీడియా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విష ప్రచారానికి దిగుతూ , అవాస్తవాలను ప్రచారం చేస్తూ, జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు.అవస్తవాలను తిప్పి కొట్టకపోతే అదే నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడుతుందని జగన్ ఆందోళన చెందుతున్నారు.
తాజాగా ఈ అంశంపై మంత్రులకు జగన్ క్లాస్ పీకినట్లు సమాచారం.ఎప్పటికప్పుడు అలెర్ట్ గా ఉంటూ చంద్రబాబు ఎల్లో మీడియాతో కూడిన దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని మంత్రులకు జగన్ సూచించారు .వాస్తవాలను ప్రజలకు వివరించాలని , దుష్ట చతుష్టయం కుట్రలను బహిర్గతం చేయాలని కోరారు.నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశం లో జగన్ ఈ అంశాలపైనే మంత్రులకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దాదాపు 95% అమలు చేశామని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా 1.70 లక్షల కోట్లను ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో లబ్ధిదారులు ఖాతాలో బదిలీ చేసామని జగన్ వివరించారు.కులం మతం పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన వారందరికీ పథకాలను అందిస్తున్నామని, దాదాపు 87% కుటుంబాల ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారని జగన్ వివరించారు.ఏపీ ప్రభుత్వానికి ప్రజలు బ్రమ్మరద పడుతున్నారని , 2019 సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లోను వైసిపి అభ్యర్థులు విజయం సాధించడమే దీనికి నిదర్శనమని జగన్ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు , ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టివి ఫైవ్ నాయుడులతో కూడిన దుష్ట చతుష్టయం ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి అదే నిజమని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తోందని, దీనికి దత్తపుత్రుడు కూడా తోడైయ్యాడని , పదేపదే అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలను ప్రజలకు చెప్పకపోతే మనమే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఈ విషయంలో అలసత్వం వహించవద్దని మంత్రులకు జగన్ గట్టిగానే చెప్పారట.







